Ireland vs Afghanistan, 5th T20I: సీమర్లు మార్క్ అడైర్ (3/16), జాషువ లిటిల్ (2/14) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని పర్యాటక జట్టుకు భారీ షాకిచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 15 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా భారీ వర్షం కురువడంతో ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపేసిన అంపైర్లు.. ఆ తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌కు 7 ఓవర్లలో 56 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయి మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఘని (40 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా తడబడినప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించారు.
పాల్ స్టిర్లింగ్ (10 బంతులో 16), లోర్కన్ టక్కర్ (12 బంతుల్లో 14) రెండంకెల స్కోర్లు సాధించగా.. హ్యారీ టెక్టార్ (5 బంతుల్లో 9), జార్జ్ డాక్రెల్ (4 బంతుల్లో 7) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ గెలుపొందగా.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డిసైడర్ దాకా తీసుకువచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment