#JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్‌ అవతారం | Jitesh Sharma: An Airforce Aspirant Who-Played Cricket For Extra Marks | Sakshi
Sakshi News home page

#JiteshSharma: అదనపు మార్కుల కోసం క్రికెటర్‌ అవతారం

Published Tue, Apr 25 2023 5:45 PM | Last Updated on Tue, Apr 25 2023 6:00 PM

Jitesh Sharma: An Airforce Aspirant Who-Played Cricket For Extra Marks - Sakshi

Photo: IPL Twitter

పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మ స్టన్నింగ్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసిన జితేశ్‌ శర్మ ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ కింగ్స్‌ తరపున అత్యధిక స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో జితేశ్‌ 357.14 స్ట్రైక్‌రేట్‌ నమోదు చేయడం విశేషం.


Photo: IPL Twitter

కాగా గత సీజన్‌లోనే జితేశ్‌ శర్మ వెలుగులోకి వచ్చాడు. ఎక్కువగా ఆరు లేదా ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తున్న జితేశ్ ఐపీఎల్‌ 2022లో పంజాబ్‌ తరపున 12 మ్యాచ్‌ల్లో 163.64 స్ట్రైక్‌రేట్‌తో 234 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా జితేశ్‌ అదిరిపోయే స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు సీజన్‌లో పంజాబ్‌ తరపున ఏడు మ్యాచ్‌ల్లో 150 స్ట్రైక్‌రేట్‌తో 145 పరుగులు చేశాడు.

ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కావాలనుకొని..


Photo: IPL Twitter

అయితే జితేశ్‌ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి లేదు. పదో తరగతి బోర్డ్‌ ఎగ్జామ్‌లో అదనపు మార్కుల కోసం క్రికెటర్‌ అవతారం ఎత్తాడు. ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కావాలన్న కోరిక జితేశ్‌లో బలంగా ఉండేది. మహారాష్ట్రలో ఎన్డీఏ పరీక్షకు స్పోర్ట్స్‌ కోటాలో ఒక కటాఫ్‌ ఉంది.

ఏ క్రీడ అయినా రాష్ట్ర స్థాయిలో ఆటగాడిగా రాణిస్తే 25 మార్కులు అదనంగా ఇస్తారు. ఇది జితేశ్‌ శర్మను బాగా ఆకట్టుకుంది. ఎలాగైనా బ్లూ డ్రెస్‌(ఎయిర్‌ఫోర్స్‌) వేసుకోవాలని కల గన్న జితేశ్‌ అలా క్రికెటర్‌ అవతారం ఎత్తాడు. కట్‌చేస్తే దేశవాలీలో విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ తరపున ఆడుతున్న జితేశ్‌ శర్మ.. ఇవాళ ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున బెస్ట్‌ ఫినిషర్‌గా ఎదిగాడు.


Photo: IPL Twitter

ఇక క్రికెట్‌పై తనకు ఆసక్తి లేదన్న విషయాన్ని జితేశ్‌ శర్మ స్వయంగా వెల్లడించాడు. ప్రాక్టీస్‌ సందర్భంగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'' నేను ఎప్పుడు క్రికెటర్‌ అవ్వాలనుకోలేదు. నిజానికి నాకు ఎలాంటి చైల్డ్‌హుడ్‌ కోచ్‌ లేడు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ క్రికెట్‌ నేర్చుకున్నా. ముఖ్యంగా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, సౌరవ్‌ గంగూలీ బ్యాటింగ్‌లకు సంబంధించిన వీడియోలను రిపీట్‌గా చూసేవాడిని.

డిఫెన్స్‌లోకి వెళ్లి ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కావాలన్న  కోరిక బలంగా ఉండేది. అయితే మహారాష్ట్రలో స్పోర్ట్స్‌ కోటాలో 25 మార్కులు అదనంగా ఇచ్చే అవకాశం ఉండేది. ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కావడం కోసం క్రికెట్‌ ఆడడం ప్రారంభించాను. 2011లో 16 ఏళ్ల వయసులో విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నా.

అక్కడే నాకు పరిచయం అయ్యాడు అమర్‌. అమర్‌ సహా అక్కడికి వచ్చిన చాలా మంది నీకు మంచి టాలెంట్‌ ఉందని.. క్రికెటర్‌గా మంచి భవిష్యత్తు ఉందని ఎంకరేజ్‌ చేశారు. అలా ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ కలను వదులుకొని క్రికెట్‌వైపు  అడుగులేశాను. నా జీవితంలో అదొక టర్నింగ్‌ పాయింట్‌'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: జితేశ్‌ శర్మ సంచలనం.. ఐపీఎల్‌ చరిత్రలో పలు రికార్డులు బద్దలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement