ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, భారత హాకీ ప్లేయర్లు గుర్జీత్ కౌర్, సవితా పునియా, హర్మన్‌ప్రీత్ సింగ్, పీఆర్ శ్రీజేశ్
Jyothi Surekha Vennam Won 2 Gold Medals: జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రపదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ఆమె కాంపౌండ్ వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో, ఒలింపిక్ రౌండ్‌లో విజేతగా నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్‌లో సురేఖ 704 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఒలింపిక్ రౌండ్ ఫైనల్లో సురేఖ 150–146తో ముస్కాన్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది.
హాకీలో అవార్డులన్నీ మనకే
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వార్షిక అవార్డుల్లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఓటింగ్ పద్ధతిలో భారత క్రీడాకారులే అన్ని అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. చిత్రంగా ఆటగాళ్లే కాదు కోచ్ అవార్డులు కూడా మన జట్ల కోచ్‌లకే రావడం మరో విశేషం. భారత పురుషులు, మహిళల జట్లకు చెందిన ఆరుగురు క్రీడాకారులు, హెడ్ కోచ్‌లు ఎఫ్‌ఐహెచ్ అత్యుత్తమ పురస్కారాలు దక్కించుకున్నారు. పురుషుల విభాగంలో హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల విభాగంలో గుర్జీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులకు ఎంపికయ్యారు.
పురుషుల విభాగంలో పీఆర్ శ్రీజేశ్... మహిళల విభాగంలో సవితా పూనియా ‘ఉత్తమ గోల్‌కీపర్’ ట్రోఫీలు గెలుచుకున్నారు. ‘బెస్ట్ రైజింగ్ స్టార్’లుగా పురుషుల విభాగంలో వివేక్ సాగర్... మహిళల విభాగంలో షర్మిలా దేవి విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో ఉత్తమ కోచ్‌గా రీడ్... మహిళల విభాగంలో ఉత్తమ కోచ్‌గా జోయెర్డ్ మరీన్ ఎంపికయ్యారు.
►79 దేశాలకు చెందిన హాకీ సమాఖ్యలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సుమారు మూడు లక్షల మంది అభిమానులు కూడా ఈ ఓటింగ్‌లో పాలుపంచుకున్నట్లు ఎఫ్‌ఐహెచ్ తెలిపింది.
►ఆగస్టు 23న మొదలైన ఓటింగ్ ప్రక్రియ గత నెల 15న ముగిసింది. మొత్తం 100 శాతంలో హాకీ జట్ల కోచ్‌లు, కెపె్టన్లకు 50 శాతం ఓటింగ్ కోటా ఉండగా... 25 శాతం ఆటగాళ్లు, అభిమానులు వేసుకోవచ్చు. మిగతా 25 శాతం మీడియాకు కేటాయించారు.
►అయితే ఓటింగ్ విధానంపై టోక్యో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ చాంపియన్ బెల్జియం హాకీ జట్టు ఆక్షేపించింది. పారదర్శకంగాలేదని ఓటింగ్ పద్ధతిని తప్పుబట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
చదవండి: Anshu Malik: తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అన్షు కొత్త రికార్డు!
Comments
Please login to add a commentAdd a comment