పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 సీజన్‌లో కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో కరాచీ విజయం సాధించింది. చివరి బంతికి మీర్ హంజా సింగిల్ తీసి కరాచీని గెలిపించాడు. అయితే 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కరాచీ ఆటగాడు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదుకు దాడికి దిగాడు. మరో ఎండ్‌లో ఉన్న షోయబ్ మాలిక్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కిరాన్ కేవలం 33 బంతుల్లోనే 5 సిక్స్‌లు, ఒక ఫోరుతో 58 పరుగులు చేశాడు. అయితే కరాచీ ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో షాహీన్ అఫ్రిది.. అద్భుత బంతితో పొలార్డ్‌ను ఔట్ చేశాడు.
ఆ తర్వాతి ఓవర్‌లోనే మాలిక్ కూడా ఔట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ లాహోర్ వైపు మలుపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో కరాచీ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది.. ఆఫ్ స్పిన్నర్ ఆషాన్ బట్టికి అప్పగించాడు. ఇదే షాహీన్ చేసిన తప్పిదం. చివరి ఓవర్‌లో తొలి బంతినే హసన్ అలీ సిక్సర్‌గా మలిచాడు.
దీంతో కరాచీ విజయసమీకరణం 5 బంతుల్లో 5 పరుగులగా మారిపోయింది. ఆ తర్వాత ఐదో బంతికి హసన్ అలీ ఔటైనప్పటికీ.. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్ మీర్ సింగిల్ తీసి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఇది చూసిన అఫ్రిది తలను పట్టుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. లహోర్ ఓన సాహిబ్జాదా ఫర్హాన్(72) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కరాచీ బౌలర్లలో మీర్ హంజా, షంసీ, హసన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment