
ఢిల్లీ : కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. సుదీర్ఘకాలంగా నేహా ఖడేఖర్‌తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్ చక్రవర్తి శనివారం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు వరుణ్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా కేకేఆర్ ఫ్రాంచైజీ వరుణ్ చక్రవర్తికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కేకేఆర్ ఒక వీడియోను విడుదల చేసింది. రిసెప్షన్ సందర్భంగా దంపతులిద్దరితో క్రికెట్ ఆడిపించారు. వరుణ్ బంతి విసరగా... అతని భార్య నేహా బ్యాటింగ్ చేస్తుండడం వైరల్‌గా మారింది. (చదవండి : బంతి జెర్సీలో దాచి పరుగు పెట్టాడు)
కాగా ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన వరుణ్ చక్రవర్తి మంచి ప్రదర్శన నమోదు చేశాడు. సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన వరుణ్ 6.84 ఎకానమీతో బౌలింగ్ చేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తికి టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కి తొలుత వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు.. అనూహ్యంగా అతను గాయపడడంతో అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌కు అవకాశం కల్పించారు.