Picture Credit: IPL Twitter
ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరమై, సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలై నానా తంటాలు పడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇవాళ (ఏప్రిల్ 5) ఓ గుడ్‌న్యూస్ మరో బ్యాడ్‌న్యూస్ తెలిసింది. విధ్వంసకర బ్యాటర్, ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది కేకేఆర్ యాజమాన్యం.
బేస్‌ప్రైజ్ రూ. 1.5 కోట్లకు అదనంగా మరో 1.3 కోట్లు (2.8 కోట్లు) చెల్లించి రాయ్‌ను సొంతం చేసుకుంది కేకేఆర్ మేనేజ్‌మెంట్. ఐపీఎల్‌లో 2017, 2018, 2021 సీజన్లు ఆడిన రాయ్.. చివరిసారిగా 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 129 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.
బ్యాడ్‌న్యూస్ ఏంటంటే..
గత కొన్ని సీజన్లుగా ఏదీ కలిసి రాక, ప్లేఆఫ్స్‌కు చేరేందకు కూడా అష్టకష్టాలు పడుతున్న కేకేఆర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సీజన్ మొత్తానికే దూరంగా కానున్నాడని తెలిసే లోపే మరో కీలక ఆటగాడు షకీబ్ అల్ హసన్ బాంబు పేల్చాడు. షకీబ్ కూడా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడం లేదని ప్రకటించాడు.
అంతర్జాతీయంగా ఉన్న కమిట్‌మెంట్లు, వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్-2023కు అందుబాటులో ఉండటం కుదరదని షకీబ్ పేర్కొన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌కే చెందిన లిటన్ దాస్ కూడా ఏప్రిల్ 10 వరకు ఉండటం లేదు. ఐర్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా లిటన్ 10వ తేదీ వరకు ఫ్రాంచైజీని గడువు కోరినట్లు సమాచారం.
కాగా, శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో నితీశ్ రాణా కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తున్న విషయం తెలిసిందే. రాణా సారథ్యంలో పంజాబ్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన కేకేఆర్.. డవ్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment