
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ చివరి దశకు చేరింది. ఇవాళ (ఆగస్ట్ 17) జరిగిన క్వాలిఫయర్-1 ఫలితంతో ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మరో బెర్త్ కోసం ఇవాళే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో బి లవ్ క్యాండీ, జాఫ్నా కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
క్వాలిఫయర్-1 విషయానికొస్తే.. గాలే టైటాన్స్‌పై డంబుల్లా ఔరా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్.. లసిత్ క్రూస్‌పుల్లే (61 బంతుల్లో 80; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. టైటాన్స్ ఇన్నింగ్స్‌లో లసిత్ ఒక్కడే రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు.
షకీబ్ (19), షనక (12), లహీరు సమరకూన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. డంబుల్లా బౌలర్లలో హేడెన్ కెర్ 3, నూర్ అహ్మద్ 2, ఫెర్నాండో, హసన్ అలీ, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన డంబుల్లా.. 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కుశాల్ పెరీరా (53), కుశాల్ మెండిస్ (49) రాణించగా.. అవిష్క షెర్నాండో (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టైటాన్స్ బౌలర్లలో షకీబ్, ప్రసన్న, షంషి, షనక తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment