క్రికెట్ ప్రపంచంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా రికార్డుల రారాజులుగా వెలుగొందారు. తమ తరంలోని ఆటగాళ్లకు సాధ్యం కాని అరుదైన ఘనతలెన్నో సాధించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాల వీరుడిగా సచిన్ చెక్కు చెదరని రికార్డుని సొంతం చేసుకుంటే.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400) బాది రికార్డుల్లో తన పేరును పదిలం చేసుకున్నాడు లారా.
ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం గౌరవ, మర్యాదలతో మెలగడమే కాకుండా చిరకాల స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినపుడల్లా సచిన్‌పై ప్రశంసలు కురిపించే బ్రియన్ లారా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తామిద్దరి కంటే కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు వేరొకరు ఉన్నారంటూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లారా చెప్పిన క్రికెటర్ మరెవరో కాదు ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్. విండీస్ మాజీ కెప్టెన్.
ఈ విషయం గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన లారా.. ‘‘కార్ల్ వంటి అత్యుత్తమ ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. టెండుల్కర్ గానీ, నేను గానీ ప్రతిభ విషయంలో అతడికి దరిదాపుల్లో కూడా లేమంటే అతిశయోక్తి కాదు.
కెప్టెన్‌గానూ కార్ల్ కెరీర్ ఎంతో మెరుగ్గా ఉంది. సారథిగా ఉన్న సమయంలోనూ సగటున 50కి పైగా పరుగులు సాధించాడు. నిజానికి వివియన్ రిచర్ట్స్‌కి నాకంటే కూడా కార్ల్ అంటేనే ఎక్కువ ఇష్టం.
అతడి ఆటను ఇష్టపడేవాడు. తనపైనే ప్రేమను కురిపించేవాడు’’ అని పేర్కొన్నాడు. కాగా 1987- 2003 మధ్య కాలంలో వెస్టిండీస్‌కు ప్రాతినిథ్యం వహించాడు కార్ల్ హూపర్.
కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. కెరీర్‌లో మొత్తంగా 102 టెస్టులు ఆడిన హూపర్ 5762 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇక 114 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక 227 వన్డేల్లో ఏడు సెంచరీల సాయంతో 5761 రన్స్ చేసిన కార్ల్ హూపర్.. 193 వికెట్లు పడగొట్టాడు. కాగా 1999 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన హూపర్.. 2001లో కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. 22 టెస్టుల్లో విండీస్‌కు అతడు సారథిగా వ్యవహరించాడు.
కెప్టెన్ కాకముందు హూపర్ బ్యాటింగ్ సగటు 36.46గా ఉంటే.. నాయకుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 46కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే లారా హూపర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment