Tilak Varma to do well in ODIs: టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ ప్రశంసలు కురిపించాడు. ఈ హైదరాబాదీ స్టార్.. లిస్ట్- ఏ క్రికెట్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయని.. అతడిని వన్డేల్లో ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. కాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన నంబూరి తిలక్ వర్మను ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడంతో దశ తిరిగింది.
అరంగేట్రంలోనే అదుర్స్
ముంబై తరఫున గత రెండు సీజన్లలో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఈ లెఫ్టాండర్‌ను తొలిసారి వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. వారి నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 139 పరుగులు సాధించాడు. అరంగేట్రంలో 39 రన్స్ చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాదాడు.
అయ్యర్ దూరమైతే
ఇక మంగళవారం ముగిసిన మూడో టీ20లో 49 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌కే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రానిపక్షంలో తిలక్ వర్మకు మిడిలార్డర్‌లో అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
గణాంకాలు అద్భుతం
‘‘హైదరాబాద్‌కు జట్టు తరఫున లిస్ట్-ఏ క్రికెట్‌లో తిలక్ వర్మ 25 మ్యాచ్‌లు ఆడి సగటున 55 పరుగులు స్కోర్ చేశాడు. మొత్తంగా ఐదు సెంచరీలు, 5 అర్ధ శతకాలు సాధించాడు. అంటే.. ఆడిన మొత్తం సందర్భాల్లో కనీసం 50 శాతమైనా తన ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలను, సెంచరీలుగా మారుస్తున్నాడు.
అతడి స్ట్రైక్‌రేటు కూడా 100కు పైగానే ఉంది. ఒకవేళ శ్రేయస్ కోలుకోకపోతే.. వర్మను జట్టులోకి తీసుకోవడం బాగానే ఉంటుంది. ఒకవేళ అలా జరుగకపోయినా.. భవిష్యత్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తిలక్ రెగ్యులర్ ప్లేయర్ అవుతాడని మాత్రం కచ్చితంగా చెప్పగలను’’ అని ఎంఎస్‌కే ప్రసాద్ చెప్పుకొచ్చాడు.
వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్లకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ మేరకు మాజీ చీఫ్ సెలక్టర్ తిలక్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా లిస్ట్-ఏ క్రికెట్‌లో తిలక్ ఇప్పటి వరకు సగటు 56.18తో 1236 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
చదవండి: ప్రపంచకప్‌లో ధోని విన్నింగ్ సిక్సర్! అత్యంత ఖరీదు.. ధర తెలిస్తే షాక్!
Comments
Please login to add a commentAdd a comment