PC: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం తమ ఫ్రాంచైజీ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. మే 20న కేకేఆర్‌తో జరగబోయే తమ లీగ్ ఆఖరి మ్యాచ్‌లో కృనాల్ అండ్ కో ప్రత్యేకమైన జెర్సీతో బరిలోకి దిగనుంది. ఎల్‌ఎస్‌జీకి యజమాని అయిన సంజీవ్ గొయెంకా కోల్‌కతా ఫుట్‌బాల్ దిగ్గజం, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఛాంపియన్ మోహన్ బగాన్ ఫ్రాంచైజ్‌కు కూడా ప్రధాన వాటాదారు కావడంతో ఐఎస్‌ఎల్ ఛాంపియన్లకు ప్రత్యేక నివాళులర్పించేందుకు ప్రత్యేక జెర్సీని ధరించనున్నట్లు ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఇందుకు లక్నో గజబ్ అందాజ్.. ఇప్పుడు కోల్‌కతా రంగుల్లో అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఐఎస్‌ఎల్ ఛాంపియన్ మోహన్ బగాన్ మరియు సిటీ ఆఫ్ జాయ్ (కోల్‌కతా)కు ప్రత్యేక నివాళి అని పేర్కొంది.
కేకేఆర్ అభిమానుల మద్దతు కోసం..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో లక్నో జట్టు ముదురు మరియు లేత నీలం రంగుతో కూడిన జెర్సీని ధరిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2023 నుంచి కేకేఆర్ దాదాపుగా నిష్క్రమించిన నేపథ్యంలో ఆ జట్టు అభిమానులను తమవైపు మళ్లించేందుకు ఎల్‌ఎస్‌జీ జెర్సీ మార్పునకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ధోని ఈడెన్ గార్డెన్స్‌లో (ఈ సీజన్‌లో) ఆడినప్పుడు, అతని గౌరవార్ధం (ఆఖరి సీజన్ అన్న ఉద్దేశంతో) కేకేఆర్ అభిమానులు పసుపు రంగు జెర్సీలు ధరించి స్టేడియంలో హంగామా చేసిన వైనాన్ని మైండ్‌లో పెట్టుకుని ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఈ చర్యకు ఉపక్రమించి ఉండవచ్చు.
ఏటీకే మోహన్ బగాన్ ఇకపై మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్..
గత ఐఎస్‌ఎల్ సీజన్ ఫైనల్లో సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని మోహన్ బగాన్ (మునుపటి ఏటీకే మోహన్ బగాన్) జట్టు బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మోహన్ బగాన్ ఈ సీజన్ ఛాంపియన్‌గా అవతరించిన అనంతరం గొయెంకా.. తన జట్టు పేరును మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్‌గా మార్చాడు. వచ్చే సీజన్‌ను తాము ఇదే పేరుతో బరిలోకి దిగుతామని ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment