10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్లోకి మనూ భాకర్
క్వాలిఫయింగ్‌లో 580 పాయింట్లతో మూడో స్థానం
నేడు మధ్యాహ్నం గం. 3:30 నుంచి పతకం కోసం పోటీ
మూడేళ్ల క్రితం ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన భారత యువ షూటర్ మనూ భాకర్ తడబడి నిరాశపరిచింది. అయితే ఈసారి ‘పారిస్’లో మాత్రం మనూ తుపాకీ గర్జించింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా క్వాలిఫయింగ్‌లో పూర్తి విశ్వాసంతో లక్ష్యంవైపు గురి పెట్టిన మనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో నేడు జరిగే ఫైనల్లో మనూ అదే జోరు కొనసాగిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ కొడుతుంది.
పారిస్: విశ్వ క్రీడల్లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ నుంచి రెండు జోడీలు బరిలోకి దిగినా పతకానికి దూరంగా నిలిచాయి. అయితే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 22 ఏళ్ల మనూ భాకర్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేకెత్తించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా–రమితా జిందాల్ (భారత్) ద్వయం 628.7 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ 626.3 పాయింట్లు సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 28 జోడీలు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్ చేరుకుంటాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో సరబ్‌జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్‌కు దూరమయ్యాడు.
33 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. సరబ్‌జోత్, జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సరబ్‌జోత్ (16) కంటే 10 పాయింట్ల షాట్‌లు ఎక్కువ కొట్టిన రాబిన్ వాల్టర్ (17) ఎనిమిదో స్థానంతో ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు.
నిలకడగా...
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ బరిలో నిలిచారు. మొత్తం 44 మంది షూటర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. మనూ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. రిథమ్ మాత్రం 573 పాయింట్లతో 15వ స్థానాన్ని దక్కించుకొని ఫైనల్‌కు దూరమైంది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో ఒక్కో షూటర్‌కు 10 షాట్‌లతో ఆరు సిరీస్‌లు అవకాశం ఇచ్చారు. మనూ వరుసగా ఆరు సిరీస్‌లలో 97, 97, 98, 96, 96, 96 పాయింట్లు సాధించింది.
నేడు జరిగే ఫైనల్లో వెరోనికా (హంగేరి), జిన్ ఓ యె (దక్షిణ కొరియా), విన్ తు ట్రిన్ (వియత్నాం), కిమ్ యెజి (దక్షిణ కొరియా), జుయ్ లీ (చైనా), తర్హాన్ సెవల్ (టరీ్క), రాన్‌జిన్ జియాంగ్ (చైనా)లతో కలిసి మనూ పోటీపడుతుంది. ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్‌లు సంధిస్తారు. 10 షాట్‌ల తర్వాత తక్కువ స్కోరు ఉన్న చివరి షూటర్ ని్రష్కమిస్తుంది. ఆ తర్వాత ప్రతి రెండు షాట్‌ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు. చివరకు 24 షాట్‌లు ముగిశాక టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment