హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించి, సరికొత్త రికార్డులను సృష్టించిన యువ ఓపెనర్ పృథ్వీషాపై భారత లెజెండరీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దేశవాళీ వన్డే టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 165.40 సగటుతో 827 పరుగులు సాధించి, తన జట్టును చాంపియన్‌గా నిలిపిన షా నిజమైన మ్యాచ్ విన్నర్ అని.. టీమిండియాలో చోటుకు అతను అర్హుడని ఆకాశానికెత్తాడు. 8 మ్యాచ్‌ల్లో నాలుగు భారీ శతకాలు బాది సెలెక్టర్లకు సవాలు విసిరిన అతను.. జాతీయ జట్టులో స్థానం ఆశించడం సహజమేనని, అయితే అందుకు షా మరికొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
టీమిండియా రిజర్వ్ బెంచ్ బలంగా ఉందని, అందులోనూ ఓపెనింగ్ స్థానం కోసం నలుగురు పోటీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో షా విఫలం కావడం ప్రతికూలాంశంగా మారిందని, అతని స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంతో షా క్యూలో వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు.
షా ప్రస్తుతం గిల్ తర్వాత స్థానంలో ఉన్నాడని, అతనికి కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డాడు. విజయ్ హజారే టోర్నీలో షాతో పాటు పడిక్కల్ సైతం వరుస శతకాలతో పరుగుల వరద పారించాడని గర్తు చేశాడు. పడిక్కల్.. గత ఐపీఎల్ సీజన్‌లో సైతం 4 అర్ధశతకాలను సాధించి, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడని పేర్కొన్నాడు. ముంబయిని విజేతగా నిలిపిన షా నిజమైన మ్యాచ్ విన్నర్ అని, భారత జట్టులో ఆడే అవకాశం త్వరలోనే అతడి తలుపు తడుతుందని ఆయన జోస్యం చెప్పాడు.
చదవండి: నాన్నకు ప్రేమతో.. కృనాల్, హార్ధిక్ ఏం చేశారో తెలుసా..?
Comments
Please login to add a commentAdd a comment