Umpire’s Call Could Be Scrapped As MCC World Cricket Members Discussed Much-Debated Law - Sakshi
Sakshi News home page

‘అంపైర్స్‌ కాల్’‌ కథ ముగియనుందా?

Published Tue, Feb 23 2021 5:48 PM | Last Updated on Tue, Feb 23 2021 6:54 PM

MCC Members Discuss On Umpire Call It Could Be Scrapped - Sakshi

న్యూఢిల్లీ: అంపైర్స్‌ కాల్‌.. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రవేశపెట్టిన ఈ నిబంధన ఆన్‌- ఫీల్డ్‌ అంపైర్ల నిర్ణయానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. బ్యాట్స్‌మన్‌ ఔట్‌/ నాటౌట్‌ విషయంలో బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద థర్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలిపెట్టడమే అంపైర్స్‌ కాల్‌. ఇక్కడ ఫీల్డ్‌ అంపైర్‌ డెసిషన్‌పైనే రివ్యూ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫీల్డ్‌ అంపైర్‌ తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడతాడు. కొన్నిసార్లు ఇది సరైన నిబంధనే అనిపించినా, చాలా సందర్భాల్లో అంపైర్స్‌ కాల్‌ వివాదాలకు దారి తీసింది. ఇటీవల భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య చెన్నైలో జరిగిన రెండో టెస్టులో భాగంగా ఇంగ్లీష్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌ అవుట్‌ విషయంపై కూడా దుమారం చెలరేగింది. టీమిండియా బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ తీసుకున్న నిర్ణయంతో భారత్‌ తీవ్ర నిరాశకు గురైంది.

అక్షర్‌ వేసిన బాల్‌ను రూట్‌ ఎదుర్కోగా అది నేరుగా కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేతుల్లో పడింది. అయితే అది రూట్‌ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్‌ అప్పీల్‌ చేసింది. కానీ ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో భారత కెప్టెన్‌ కోహ్లి డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. రీప్లేలో భాగంగా బంతి జో రూట్‌ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా ఎక్కడా ఎడ్జ్‌ అవ్వలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్‌ ఉందేమోనని థర్డ్‌ ఎంపైర్‌ మరోసారి పరిశీలించగా, ప్యాడ్లు తాకుతూ ఆఫ్‌స్టంప్‌ మీదుగా బంతి వెళ్లినట్లు కనిపించింది. దీంతో అవుట్‌ అని రిప్లేలో స్పష్టమైంది. కానీ బంతి ప్రభావం ఆఫ్‌ స్టంప్‌పై ఉండటంతో ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే థర్డ్‌ అంపైర్‌ అప్పచెప్పాడు. దాంతో తొలుత నాటౌట్‌ నిర్ణయానికే ఫీల్డ్‌ అంపైర్‌ కట్టుబట్టాడు. రూట్‌ బతికిపోయాడు. ఇక్కడ చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్‌ షాక్‌ ఇవ్వనున్నాడా!

దీంతో కోహ్లి కాసేపు ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనత్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్స్‌ కాల్‌ నిబంధన వల్ల కలిగిన నష్టానికి ఇదొక నిదర్శనం వంటిది.ఇలాంటి ఘటనల ఆధారంగా ఈ రూల్‌కు స్వస్తి పలకాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్‌​ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) తాజా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఆసీస్‌ దిగ్గజం​ రిక్కీ పాంటింగ్‌, శ్రీలంక లెజెండ్‌ కుమార సంగక్కర తదితరులతో కూడిన కమిటీ తమ ఎజెండాలో భాగంగా.. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్‌ కాల్‌ నిబంధనను రద్దు చేసేందుకు సముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు.. ‘‘డెసిషన్‌ రివ్యూ సిస్టం ద్వారా తేలిన ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్‌ కాల్‌ ఎంతమేరకు ఉపయోగకరం అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ నిబంధన కారణంగా ఆడియెన్స్‌ కాస్త గందరగోళానికి గురవ్వాల్సి వస్తుందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒకవేళ రివ్యూలో అవుట్‌/ నాటౌట్‌(ఎల్బీడబ్ల్యూ) అని తేలితే అంపైర్స్‌ కాల్‌తో సంబంధం లేకుండా ఏదొక  నిర్ణయానికి థర్డ్‌ అంపైర్‌ కట్టుబడి ఉండాలని కమిటీ పేర్కొంది’’ అని ఎంసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో మరికొంత మంది సభ్యులు మాత్రం.. ప్రస్తుత విధానంతో వారు సంతృప్తిగానే ఉన్నారని, బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఎన్నో ఏళ్లుగా అంపైర్‌ నిర్ణయానికి కట్టుబడి ఎన్నో ఫలితాలు తేలాయని, దీనిని కొనసాగించడం వల్ల నష్టమేమీలేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. కమిటీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను ఐసీసీకి పంపనున్నట్లు వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement