ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో కొనసాగుతూ ప్రత్యర్ధి బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలా మారిన పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. తాజాగా తనపై, తన జట్టుపై వస్తున విమర్శలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 7) బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకంతో చెలరేగిన అనంతరం రిజ్వాన్ మాట్లాడుతూ.. తన జట్టు ప్రదర్శనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఎక్కడో కూర్చొని తమపై విమర్శలు చేసే ప్రతోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించాడు.
ఇటీవలి కాలంలో రిజ్వాన్ మినహా పాక్ జట్టు యావత్తు మూకుమ్మడిగా విఫలమవుతున్న నేపథ్యంలో ఆ దేశ మాజీలు పాక్ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కెప్టెన్ బాబర్ ఆజమ్ సహా జట్టు మొత్తంపై పాక్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గతేడాది ఫార్మాట్లకతీతంగా రాణించి.. ఈ ఏడాది ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టలేక చతికిలపడిన పాక్‌ను విశ్లేషకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన అనంతరం రిజ్వాన్ తమను విమర్శిస్తున్న వారికి గెలుపుతో సమాధానం చెప్పాడు.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌కు ముందు జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో ఇవాళ బంగ్లాదేశ్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాక్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. రిజ్వాన్ (50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 78) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ రిజ్వాన్ మినహా పాక్ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం విఫలమైంది.
Comments
Please login to add a commentAdd a comment