ముంబై: తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు టీమిండియా కోచ్ రవిశాస్త్రి తనను ఓదార్చడమే కాకుండా, కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని తనలో ధైర్యం నింపాడని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ఆ బాధాకర సమయంలో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో కలిసి రవి సర్ తనకు అండగా నిలిచారని, వారే లేకపోయుంటే ఆసీస్ పర్యటన నుంచి వైదొలిగేవాడినని చెప్పుకొచ్చాడు. తండ్రి మరణవార్త తెలియగానే విరాట్ భాయ్ తనను కౌగిలించుకుని ఓదార్చడని, కోచ్ రవి సర్ ఆ సమయంలో తనతో మాట్లాడిన మాటలను జీవితాంతం మర్చిపోలేనని వెల్లడించాడు.
"నువ్వు దేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాలని నీ తండ్రి కలగన్నాడని, ఆ అవకాశం ఇప్పుడు నీకు వచ్చిందని, ఈ సమయంలో నీ తండ్రి లేకపోయినా అతని ఆశీర్వాదం నీతో ఉంటుందని" ఆయన నాలో స్పూర్తిని రగిల్చారని గుర్తు చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసాక రవి సర్ తనను ప్రశంసలతో ముంచెత్తిన విషయాన్ని తలచుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన నిమిత్తం లండన్‌కు బయల్దేరిన సిరాజ్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా నవంబర్ 20న తండ్రిని కోల్పోయాడు. క్వారంటైన్ ఆంక్షలు ఉండటం, టెస్ట్ క్రికెట్ ఆడాలన్న తండ్రి కల నెరవేర్చేండం కోసం అతడు అక్కడే ఉండిపోయి, తండ్రి అంత్యక్రియలకు సైతం హాజరు కాలేకపోయాడు. తండ్రి కలను నెరవేర్చేందుకు దుఃఖాన్ని దిగ మింగి బరిలోకి దిగిన ఈ హైదరబాదీ క్రికెటర్‌కు, ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ మరపురాని అనుభూతులను మిగిల్చింది.
చదవండి: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment