ఎంఎస్ ధోని(ఫైల్‌ఫోటో)
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కరోనా వైరస్ టెస్టులో నెగిటివ్ రావడంతో ఐపీఎల్ ఆడటానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 20వ తేదీన యూఏఈకి వెళ్లే ప‍్రయత్నంలో ఉన్న ఐపీఎల్ ఆటగాళ్లకు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ధోని కరోనా టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చింది. దాంతో సీఎస్‌కే క్యాంప్‌లో ధోని జాయిన్ కావడానికి లైన్ క్లియర్ అయ్యింది. ఆగస్టు 15వ తేదీ నుంచి సీఎస్‌కే ట్రైనింగ్ క్యాంప్ ఆరంభం కానుంది. ప్రస్తుతం సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌ల్లో బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ ఒక్కడే క్యాంపులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకూ యూఏఈలో ఐపీఎల్ జరుగనుంది. బయో సెక్యూర్ విధానంలో ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఎంతోప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ఈ సీజన్ ఐపీఎల్.. బీసీసీఐకి కత్తిమీద సవాల్‌గా మారింది. (3911 రోజుల తర్వాత రీఎంట్రీ)
ఏ ఒక్క క్రికెటర్ కరోనా బారిన పడకుండా నిర్వహించాలని యాజమాన్యం యోచిస్తోంది. ఒకవేళ ఆట మొదలయ్యాక ఎవరికైనా కరోనా వచ్చిందంటే అది మొత్తం ఐపీఎల్ మీదే ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో ఈ లీగ్ అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐలు సన్నద్ధమయ్యాయి. దానిలో భాగంగా ఐపీఎల్‌కు వెళ్లే ప్రతి ఒక్క క్రికెటర్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కింగ్స్ పంజాబ్ ఆటగాడు కరుణ్ నాయర్‌కు కరోనా సోకి తగ్గిందనే వార్తలు సానుకూల పరిణామమే. ఎవరైనా యూఏఈలో కరోనా బారిన పడితే 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే. వారిని ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తారు. మళ్లీ నెగిటివ్ వచ్చిందనే వరకూ అతను క్వారంటైన్‌లో ఉండకతప్పదు. కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే జట్టు సభ్యులతో కలుస్తాడు. (‘ట్రిపుల్ సెంచరీ’ హీరోకు కరోనా!)
Comments
Please login to add a commentAdd a comment