ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో జత కట్టనున్న టీమిండియా దిగ్గజం | Mumbai Rope In Jhulan Goswami In Coaching Staff | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీతో జత కట్టనున్న టీమిండియా దిగ్గజం

Feb 5 2023 7:00 PM | Updated on Feb 6 2023 11:37 AM

Mumbai Rope In Jhulan Goswami In Coaching Staff - Sakshi

టీమిండియా దిగ్గజ బౌలర్‌, భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ పేసర్‌ ఝులన్‌ గోస్వామి మహిళల ఐపీఎల్‌ (WPL)లో కాలు మోపనుంది. గతేడాది క్రికెట్‌లోకి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఝులన్‌.. WPLలో ముంబై ఫ్రాంచైజీ మెంటార్‌గా, బౌలింగ్‌ కోచ్‌గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఆదివారం (ఫిబ్రవరి 5) అధికారికంగా ప్రకటించింది.

ముంబై యాజమాన్యం ఝులన్‌తో పాటు మరో ముగ్గురిని కూడా కోచింగ్‌, ఇతరత్రా సిబ్బందిలో చేర్చుకుంది. చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ను హెడ్‌ కోచ్‌గా నియమించుకున్న ముంబై ఫ్రాంచైజీ.. భారత మహిళల జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ దేవిక  పల్షికార్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా, భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ మేనేజర్‌ తృప్తి భట్టాచార్యను టీమ్‌ మేనేజర్‌గా అపాయింట్‌ చేసుకుంది.

ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌ మహిళల టీమ్‌ చార్లెట్‌ నేతృత్వంలో, ఝులన్‌ మెంటార్షిప్‌లో, దేవిక బ్యాటింగ్‌ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతూ ముంబై ఇండియన్స్‌ మెన్స్‌ టీమ్‌ లెగసీని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.   

కాగా, 43 ఏళ్ల చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రిటైర్మెంట్‌ తర్వాత ఆమె ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. 2022లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌గా ఎంపికైన ఎడ్వర్డ్స్‌ మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ (ఆస్ట్రేలియా), ద హండ్రెడ్‌ (ఇంగ్లండ్‌) లీగ్‌ల్లో వివిధ జట్లకు కోచ్‌గా పని చేశారు.

ఝులన్ విషయానికొస్తే..  అంతర్జాతీయ  మహిళల క్రికెట్‌లో అత్యధిక వికెట్ల ఘనత ఈమె పేరిటే ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె ఖాతాలో 350కి పైగా వికెట్లున్నాయి.   గతేడాది ఇంగ్లాండ్  సిరీస్ తర్వాత  ఝులన్ ఆట నుంచి తప్పుకుంది.

మరోవైపు, WPLలో అదానీ ఫ్రాంచైజీ గుజరాత్‌ కూడా కోచింగ్ సిబ్బందిని  నియమించుకుంది. ఆ ఫ్రాంచైజీ రేచల్ హేన్స్‌ను హెడ్‌ కోచ్‌గా.. ఇటీవల  అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు  హెడ్ కోచ్  నూషిన్ అల్ ఖాదిర్‌ను బౌలింగ్ కోచ్.. తుషార్ అరోథ్‌ను  బ్యాటింగ్ కోచ్‌గా.. గవన్ ట్వినింగ్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది.  


   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement