పాక్‌తో తొలి వన్డేలో నెదర్లాండ్స్ అద్భుత పోరాటం(PC: Cricket Netherlands)
Netherlands vs Pakistan, 1st ODI (Rescheduled match): పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నెదర్లాండ్స్ చుక్కలు చూపించింది. ఆఖరి వరకు పోరాడి ఓడినప్పటికీ అద్భుత పోరాటం కనబరిచి అభిమానుల మనసు గెలుచుకుంది. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి తమని పసికూన అని తేలికగా తీసిపారేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక చావు తప్పి కన్నులొట్టబోయినట్లు బాబర్ ఆజం బృందం 16 పరుగుల తేడాతో గట్టెక్కింది. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తోంది.
సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్
ఇందులో భాగంగా రోటర్‌డామ్ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. టాస్ గెలిచిన పర్యాటక పాక్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ సెంచరీ(109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 109 పరుగులు- రనౌట్)తో చెలరేగి శుభారంభం అందించాడు.
అయితే, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం 74 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత రిజ్వాన్ 14, ఖుష్‌దిల్ 21 పరుగులు సాధించారు. ఇక షాబాద్ ఖాన్, సల్మాన్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి వరుసగా 48, 27 పరుగులు చేశారు.
PC: Cricket Netherlands
దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మాకు ఒకటి, వాన్ బీక్‌కు రెండు, బాస్ డె లీడేకు రెండు వికెట్లు దక్కాయి.
మూడు అర్ధ శతకాలు!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య నెదర్లాండ్స్‌కు ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 65 పరుగులతో రాణించి ఊపిరి పోశాడు. మరో ఓపెనర్ మాక్స్ ఒడౌడ్ (1), వన్‌డౌన్ బ్యాటర్ వెస్లీ(2) సహా బాస్ డీ లీడే(16) పూర్తిగా విఫలమైనా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టామ్ కూపర్ 54 బంతుల్లో 65 పరుగులతో చెలరేగాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్..
టామ్ కూపర్‌కు జతకలిసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ 60 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి అద్భుత పోరాటం చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు.
అయితే, మిగతా ఆటగాళ్లు తేజ నిడమనూరు(15), లోగాన్ వాన్ బీక్(28), టిమ్ ప్రింగ్లే(0), ఆర్యన్ దత్(6- నాటౌట్) అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసిన నెదర్లాండ్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కాస్త ఉపశమనం: బాబర్ ఆజం
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘ఎట్టకేలకు నాకు కాస్త ఉపశమనం లభించింది. ఫఖర్ అద్భుతమైన శతకం సాధించాడు. మేము మరింత మెరుగ్గా రాణించాల్సింది. ఇక్కడి పిచ్ పరిస్థితులు మాకు గట్టి సవాల్ విసిరాయి. వికెట్ కాస్త తేమగా ఉంది’’ అంటూ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది!
ఇక నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్.. ‘‘నిజంగా ఈ ఓటమి మమ్మల్ని పూర్తిగా నిరాశపరిచింది. 3, 4 క్యాచ్‌లు వదిలేశాం. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇటీవలి కాలంలో మేము మెరుగ్గా రాణిస్తున్నాం. కానీ.. ఈరోజు చేజేతులా ఓటమిని ఆహ్వానించినట్లయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు నెదర్లాండ్స్ అర్హత సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: Kevin Obrien: ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి! కెవిన్ అరుదైన ఘనతలు!
IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త
🗣️ Fakhar Zaman shares how he and Babar Azam planned for their superb 168-run partnership as he reviews the first ODI against the Netherlands 🏏#NEDvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/3L4eptqgQw
— Pakistan Cricket (@TheRealPCB) August 17, 2022
Comments
Please login to add a commentAdd a comment