అందుకే అయ్యర్‌పై వేటు?.. క్లారిటీ ఇచ్చిన ద్రవిడ్‌ | Absolutely No: Rahul Dravid Says Reason Behind Shreyas Iyer's Absence - Sakshi
Sakshi News home page

Shreyas Iyer: అందుకే అతడిని సెలక్ట్‌ చేయలేదు.. కారణం చెప్పిన ద్రవిడ్‌

Published Wed, Jan 10 2024 9:09 PM | Last Updated on Thu, Jan 11 2024 11:16 AM

No Absolutely Not: Rahul Dravid Said Reason for Shreyas Iyer Missing Out - Sakshi

శ్రేయస్‌ అయ్యర్‌

Ind vs Afg T20Is- Rahul Dravid Comments On Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గురించి వస్తున్న వార్తలను హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఖండించాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్లనే అతడిని జట్టు నుంచి తప్పించారన్న వదంతులను కొట్టిపారేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే.

ఆసీస్‌ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా
సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో జరిగిన ఈ సిరీస్‌ తాలుకు ఆఖరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీ20 జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ.. పొట్టి ఫార్మాట్లో సఫారీలతో జరిగిన సిరీస్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

అఫ్గన్‌తో సిరీస్‌కు పక్కనపెట్టేశారు
ఈ క్రమంలో సొంతగడ్డపై జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు అతడిని పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే అయ్యర్‌పై వేటు వేశారంటూ వదంతులు వ్యాపించాయి.

ఈ విషయంపై తాజాగా స్పందించిన హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. ‘‘అఫ్గన్‌తో సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడానికి డిసిప్లినరీ యాక్షన్‌ కారణమన్నది పూర్తిగా అవాస్తవం. అతడు ఈ సిరీస్‌ మిస్సయ్యాడంతే!

చాలా మంది ఉన్నారు
జట్టులో ఇప్పటికే చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. అందుకే సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ అతడికి ఆడే అవకాశం రాలేదు. ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. జట్టులో ఎక్కువ మంది బ్యాటర్లు ఉన్నందువల్ల గట్టి పోటీ ఉంది.

ప్రతి ఒక్కరిని తుదిజట్టులో ఆడించడం కుదరదు కదా. అందుకే అయ్యర్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది. అంతేగానీ క్రమశిక్షణారాహిత్యం వల్ల అతడిని తప్పించామనడం సరికాదు. అసలు ఈ విషయం గురించి సెలక్టర్లతో నేను ఎలాంటి చర్చలు జరుపలేదు’’ అని స్పష్టతనిచ్చాడు.

రంజీల్లో అయ్యర్‌ ఆట
కాగా అఫ్గన్‌తో సిరీస్‌కు ఎంపిక కాని శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లండ్‌తో టెస్టులకు సన్నద్ధమయ్యే పనిలో పడ్డాడు. ముంబై తరఫున రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో ఆడేందుకు అతడు నిర్ణయించుకున్నాడు. ఆంధ్రా జట్టుతో జనవరి 12 నుంచి మొదలుకానున్న మ్యాచ్‌లో పాల్గొనే ముంబై జట్టులో సెలక్టర్లు అయ్యర్‌ పేరును చేర్చారు.

చదవండి: IND Vs AFG T20I Series: రీఎంట్రీలో అభిమానులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన కోహ్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement