ఆసీస్‌కు దీటుగా బదులిస్తున్న కివీస్ (PC. Blackcaps X)
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తద్వారా ఆతిథ్య కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి కివీస్ మూడు వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది.
కాగా న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది ఆస్ట్రేలియా. అనంతరం ఇరు జట్లు మధ్య వెల్లింగ్‌టన్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 383 పరుగులకు ఆలౌట్ అయింది. కామెరాన్ గ్రీన్ (174 నాటౌట్; 23 ఫోర్లు, 5 సిక్స్‌లు), హాజల్‌వుడ్ (22; 4 ఫోర్లు) పదో వికెట్‌కు 116 పరుగులు జోడించడం విశేషం.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 43.1 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్ (71; 13 ఫోర్లు), హెన్రీ (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే రాణించారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఈ క్రమంలో 204 పరుగుల భారీ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 13 పరుగులు సాధించింది. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓవరాల్ ఆధిక్యం 217 పరుగులకు చేరింది.
ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటను 13/2తో మొదలుపెట్టిన ఆసీస్.. మరో 151 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ మాయాజాలంతో ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. పేసర్లు కెప్టెన్ టిమ్ సౌతీ రెండు, మ్యాట్ హెన్రీ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 8, విల్ యంగ్ 15 పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 9 పరుగులకే అవుటయ్యాడు.
ఇలా జట్టు కష్టాల్లో కూరుకుని ఉన్న వేళ రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డారు. మూడో రోజు ఆట ముగిసే సరికి రచిన్ 94 బంతుల్లో 56, మిచెల్ 63 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 41 ఓవర్లలో న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.
ఆసీస్‌కు దీటుగా బదులిస్తూ మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవాలంటే ఇంకా 258 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆసీస్ విజయానికి ఏడు వికెట్లు కావాలి.
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సరికి స్కోర్లు:
ఆస్ట్రేలియా- 383 & 164
న్యూజిలాండ్- 179
న్యూజిలాండ్ విజయ లక్ష్యం- 369..
మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి స్కోరు- 111/3 (41). న్యూజిలాండ్ గెలవాలంటే మరో 258 పరుగులు చేయాలి.
చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment