New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది.
సిరీస్ కివీస్‌దే
కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్‌వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు
అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు.
బంగ్లా ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్‌కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు.
ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది.
నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర
లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్‌తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు.
మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.
చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం!
Comments
Please login to add a commentAdd a comment