
టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇకపై ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించేలా మన ఆటగాళ్లంతా స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు.
ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, బజరంగ్, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్‌ల తోపాటు కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు, ఇతర క్రీడాకారులు, కోచ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, నితీశ్ ప్రామాణిక్, ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు నరీందర్ బత్రా, రాజీవ్ మెహతా కూడా పాల్గొన్నారు.