ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభ తేదీపై లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశాడు. మార్చి 22 నుంచి లీగ్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ఎలక్షన్ కమీషన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. సీఈసీ నుంచి ఎన్నికల తేదీ ప్రకటన వెలువడిన వెంటనే లీగ్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని అన్నాడు. ఈ విషయమై లీగ్ గవర్నింగ్ బాడీ సీఈసీతో అనునిత్యం టచ్‌లో ఉంటున్నట్లు పేర్కొన్నాడు.
ధుమాల్ ప్రకటనకు ముందు ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్‌లో ఓ కథనం వచ్చింది. ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22న ప్రారంభమై, మే 26తో ముగుస్తుందని సదరు కథనం సారాంశం. అందులోని వివరాల మేరకు ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను దశలవారీగా ప్రకటించాలని లీగ్ నిర్వహకులు యోచిస్తున్నారు. తొలుత కొన్ని మ్యాచ్‌లకు (15 రోజులు) షెడ్యూల్‌ను ప్రకటించి, మిగతా మ్యాచ్‌లకు మరో తేదీన షెడ్యూల్‌ను ప్రకటించాలని భావిస్తున్నారు. 2019 ఎలక్షన్ ఇయర్‌లోనూ ఇలాగే జరిగింది. ఐపీఎల్ నిర్వహకులు ఈ సీజన్‌లోనూ పాత ఫార్ములానే వాడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా, ఐపీఎల్ 2024 ప్రారంభ తేదీపై గతకొద్ది రోజులగా గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల తేదీలపై క్లారిటీ రాకపోవడంతో లీగ్ నిర్వహకులు సందిగ్దంలో ఉండిపోయారు. తొలుత లీగ్‌ను మార్చి 26 నుంచి ప్రారంభించాలని అనుకున్నప్పటికీ.. ఆ తేదీపై సీఈసీ నుంచి అభ్యంతరం రావడంతో పెద్దలు ప్రత్యామ్నాయ తేదీని వెతుక్కున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment