చెన్నై: అగ్రశ్రేణి స్పిన్నర్‌గా భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించినా రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ సత్తాపై అనేక మార్లు ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. తాజా సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా గడ్డపై అతను విఫలమైన విషయాన్ని పదే పదే అందరూ గుర్తు చేశారు. విదేశాల్లో రాణించలేడనే అపవాదూ అతనిపై ఉండేది. ఒక దశలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్, ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీలు కూడా అతనికంటే మెరుగైన వారని కథనాలు వచ్చాయి. అయితే ఈ సిరీస్‌లో 28.83 సగటుతో 12 వికెట్లు తీసిన అశ్విన్ జట్టు సిరీస్ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ పోరులో టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్‌ను అవుట్ చేసే విషయంలో తన ఆలోచనల గురించి చెప్పిన అశ్విన్... పనిలో పనిగా ఇతర స్పిన్నర్లతో తనను పోల్చడంపై ఘాటుగా స్పందించాడు.
‘ఒక మ్యాచ్‌కు ముందు నేను సొంతంగా హోమ్ వర్క్ చేసుకుంటాను. ఎనిమిది గంటల పాటు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వీడియోలు చూస్తాను. ఆపై మ్యాచ్‌లో ఎక్కడ, ఎలాంటి ఫీల్డింగ్ ఉండాలో నిర్ణయించుకుంటా. టిమ్ పైన్‌ను మెల్‌బోర్న్‌లో అలాగే అవుట్ చేశా. స్మిత్‌ను ఎవరు అవుట్ చేస్తారనే దానిపై బాగా చర్చ జరిగింది. ఎవరూ నా గురించి మాట్లాడనే లేదు. ఆసీస్ గడ్డపై స్మిత్ ఎప్పుడూ స్పిన్నర్ల బౌలింగ్‌లో అవుట్ కాలేదు. నేను దానిని మార్చాలనుకున్నా. ప్రపంచంలో నన్ను నేను అత్యుత్తమ బౌలర్‌గా భావించుకుంటా. అలాగే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని కోరుకుంటా. కోహ్లితో తలపడలేను కాబట్టి స్మిత్‌తో తలపడ్డా. ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత అందరూ నా గురించి మాట్లాడుకునేలా చేశా’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
లయన్, అలీలతో పోలుస్తూ తనను మరీ ‘మైక్రోస్కోప్’ కింద ఉంచి పరీక్షించారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్‌లో అశ్విన్‌కంటే లయన్ ప్రదర్శన బాగుండగా... 2018 సౌతాంప్టన్ టెస్టులో అలీ వికెట్లు తీసిన చోట అశ్విన్ విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ‘లయన్‌గానీ అలీగానీ సరిగ్గా ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తున్నప్పుడు కామెంటరీ బాక్స్ నుంచి వార్న్ వాటిని అద్భుతంగా వర్ణించినంత మాత్రాన నేను అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదు. వారు భారత బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. నేను ఆస్ట్రేలియా లేదా ఇంగ్లండ్‌కు బౌలింగ్ చేస్తున్నాను. గత సిరీస్‌లో అడిలైడ్‌లో నా పొత్తికడుపులో గాయమైనా సరే పట్టుదలగా ఆడి ఆరు వికెట్లు తీశాను. కానీ మ్యాచ్ ముగిశాక నాకంటే లయన్ ఎంత బాగా బౌలింగ్ చేశాడో అందరూ చెప్పుకున్నారు. ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది. లయన్ మంచి బౌలరే. అతనంటే నాకు గౌరవం ఉంది. కానీ నా ఆలోచనలు వేరు. ఇకపై లయన్‌తో పోటీ పడటంకంటే స్మిత్‌తో తలపడటం ముఖ్యమని అర్థం చేసుకున్నా’ అని అశ్విన్ వివరించాడు.
అర మీసంతో ఆడతా!
సహచరుడు పుజారాకు అశ్విన్ సరదాగా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మొయిన్ అలీతో పాటు మరే స్పిన్నర్ బౌలింగ్‌లోనైనా పుజారా పిచ్‌పై ముందుకు దూసుకొచ్చి బౌలర్ తల మీదుగా భారీ షాట్ ఆడితే తాను సగం మీసం తీసేస్తానని... అలాగే మైదానంలో మ్యాచ్ ఆడతానని అశ్విన్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment