క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చిరకాల ప్రత్యర్థులుగా అభివర్ణిస్తారు. ఇరుజట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాషెస్ అంటే టెస్టు సిరీస్ కావొచ్చు కాని.. సంప్రదాయ క్రికెట్‌లో ఉండే మజా ఎంత రుచిగా ఉంటుందో ఈ సిరీస్ తెలియజేస్తుంది.ట్రోపీలో ఉండే బూడిదను దక్కించుకోవడం కోసం ఇరుజట్లు కొదమసింహాల్లా తలపడుతుంటాయి.
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో.. యాషెస్ సిరీస్ పట్ల అభిమానుల్లో అదే ఉత్సాహం కనిపించడం సహజం. ఇరుజట్ల మధ్య తొలిసారి 1882-83లో యాషెస్ సిరీస్ జరగ్గా.. అప్పటినుంచి 72 సిరీస్‌లు ఆడగా.. ఆస్ట్రేలియా 34 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు యాషెస్‌ను కైవసం చేసుకున్నాయి. మరో ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి.
మరి 139 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ ప్రతీ రెండేళ్లకోసారి జరుగుతుంది. 2023లో ఇంగ్లండ్ వేదికగా జూన్ నుంచి ఆగస్టు వరకు జరిగే అవకాశముంది. కానీ ఐసీసీ ఏర్పాటు చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ)లో భాగంగా బిజీ షెడ్యూల్ ఉండడం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను తొలిసారి వాయిదా వేసేలా చేయనుంది. ఎఫ్‌టీపీతో పాటు హండ్రెండ్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ జట్టులోని మెజారిటీ ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
దీంతో 139 ఏళ్ల చరిత్రలో యాషెస్ సిరీస్ వాయిదా పడడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. ఐసీసీ ప్లాన్ చేసిన ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ప్రకారం అన్ని జట్లకు బిజీ షెడ్యూల్ ఉండడంతో పాటు.. ఆయా దేశాలు నిర్వహించే హండ్రెడ్ టోర్నమెంట్, ఐపీఎల్ లాంటి లీగ్‌లకు ఎఫ్‌టీపీ విండోలో సెపరేట్‌గా షెడ్యూల్ ఉంది. దీనికి అనుగుణంగానే ఎఫ్‌టీపీ షెడ్యూల్ డిజైన్ చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువున్నాయి. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో హండ్రెడ్ టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌ను ముందుకు జరిపే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఈసారి జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌కు ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ సహా జానీ బెయిర్ స్టో లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరంగా ఉన్నారు. ఆగస్టు 17 నుంచి సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్, భారత్‌లతోనూ వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
ఇక 2021/22 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-0తో దక్కించుకుంది. ఇంగ్లండ్‌ను చీల్చి చెండాడుతూ సిరీస్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ యాషెస్‌ను దక్కించుకుంది. యాషెస్ ఓటమితో పాటు వెస్టిండీస్‌కు సిరీస్ కోల్పోవడంతో ఓటములకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రూట్ అనంతరం కెప్టెన్‌గా వచ్చిన స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లండ్ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తోంది. అయితే స్టోక్స్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి యాషెస్ సిరీస్ కానుండడం.. ఈసారి సొంతగడ్డపై యాషెస్ జరగనుండడం ఇంగ్లండ్‌కు సానుకూలాంశమని చెప్పొచ్చు.
చదవండి: Cricket Australia: 'లంక ప్రజల దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment