Ashes 2023, AUS Vs ENG 5th Test: Never Seen Them Play With So Much Fear Worst Michael Vaughan Criticises Australia - Sakshi
Sakshi News home page

Eng Vs Aus: ఆసీస్‌ ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో చూడలేదు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

Published Sat, Jul 29 2023 2:50 PM

Never Seen Them Play With So Much Fear Worst Michael Vaughan Criticises Australia - Sakshi

The Ashes, 2023- England vs Australia, 5th Test: యాషెస్‌ సిరీస్‌-2023 ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ తీరుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ విమర్శలు గుప్పించాడు. కంగారూ జట్టు ఇంత బెరుగ్గా, భయం భయంగా బ్యాటింగ్‌ చేయడం ఎన్నడూ చూడలేదన్నాడు. ఓవల్‌ మైదానంలో ఆసీస్‌ ప్రదర్శన చెత్తగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఇప్పటికే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ట్రోఫీ తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై.. ఆఖరి మ్యాచ్‌లో గెలిచి 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకోవాలని ఇంగ్లండ్‌ పట్టుదలగా ఉంది. 

స్వల్ప ఆధిక్యంలో
ఇక బజ్‌బాల్‌ విధానం పేరిట దూకుడుగా ఆడుతున్న స్టోక్స్‌ బృందం.. ఓవల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. హ్యారీ బ్రూక్‌(85) మెరుగైన ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో.. బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌.. రెండో రోజు ఆట ముగిసే సరికి 295 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ ముగించింది.

ఇంత చెత్తగా ఆడటం ఎప్పుడూ చూడలేదు
స్టీవ్‌ స్మిత్‌ అర్ధ శతకం(71) కారణంగా 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించగలిగింది. ఆచితూచి ఆడుతూ ఈ మేరకు స్కోరు సాధించింది. వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌ 82 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడంటే కంగారూల బ్యాటింగ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మైకేల్‌ వాన్‌ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఇంత డిఫెన్సివ్‌గా ఆడటం ఎప్పుడూ చూడలేదు.

సాధారణంగా వాళ్లు దూకుడుగా ఆడతారు. మ్యాచ్‌ చూసే వాళ్లకు మజా అందిస్తారు. కానీ ఈసారి.. బౌలర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోయారు. నేనైతే ఆస్ట్రేలియా ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. నిజం.. వాళ్లు గతంలో ఇలా అస్సలు ఆడలేదు’’ అని బీబీసీ మ్యాచ్‌ స్పెషల్‌ ప్రోగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. 

చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి

Advertisement
 
Advertisement
 
Advertisement