విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ వేలం మంగళవారం విశాఖలో జరిగింది. ఇందులో దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన విశాఖ కుర్రాడు రికీ బుయ్ రికార్డు ధర పలికాడు. రూ.8,10,000కు బెజవాడ టైగర్స్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధిక ధర. సౌత్‌జోన్ కెప్టెన్ హనుమ విహారీను రూ.6,60,000తో రాయలసీమ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.
ఏపీలోని 6 ఫ్రాంచైజీ జట్లతో ఈ నెల 16 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆంధ్రా తరఫున రంజీలతో సహా అంతర్జాతీయ క్రికెట్‌లో పలు స్థాయిల్లో సత్తా చాటిన 567 మంది ఆటగాళ్లను వారి గ్రేడ్‌ను బట్టి వేలం నిర్వహించారు. 6 ఫ్రాంచైజీలు మొత్తంగా 120 మంది ఆటగాళ్లను జట్లకు ఎంపిక చేసుకున్నాయి.
ఏసీఏ పర్యవేక్షణలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐపీఎల్ జట్ల వేలం నిర్వహించే వ్యాఖ్యాత చారుశర్మ ఈ వేలాన్ని నిర్వహించగా..కౌన్సిల్ చైర్మన్ మునీష్ సెహగల్ ప్రారంభించారు. లైనప్‌ను సరి చూసుకుంటూ ఫ్రాంచైజీలు మొత్తంగా రూ.1.8 కోట్లను వినియోగించుకున్నాయి. కాగా, గిరినాథ్‌రెడ్డిని రూ.6,10,000లకు రాయలసీమ కింగ్స్, కేఎస్ భరత్‌ను రూ.6,00,000లకు ఉత్తరాంధ్ర లయన్స్ నెలబెట్టుకున్నాయి. వైజాగ్ వారియర్స్ అశ్విన్ హెబ్బర్‌ను రూ.5,10,000కు, కోస్టల్ రైడర్స్ స్టీఫెన్, లేఖజ్‌లను రూ.4,50,000లకు నిలబెట్టుకున్నాయి. రూ.50,000 కనీస ధరతో బిడ్ ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment