
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించిన రోహిత్ శర్మ, టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ శతకంతో హిట్‌మ్యాన్ పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. ఇందులో అత్యధిక సిక్సర్ల రికార్డు ముఖ్యమైనది. విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ పేరిట ఉన్న ఈ రికార్డును రోహిత్ నిన్నటి మ్యాచ్‌లో అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో కలిపి గేల్ 553 సిక్సర్లు సాధించగా.. రోహిత్ ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో ఈ సంఖ్యను అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 556 సిక్సర్లు ఉన్నాయి.
The 45s love their 6⃣s 👍 pic.twitter.com/5FHEP0xEwL
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2023
హిట్‌మ్యాన్ తన రికార్డును బద్దలుకొట్టిన నేపథ్యంలో గేల్ అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకు రోహిత్ థ్యాంక్స్ చెబుతూ.. 4, 5 మన జెర్సీలపై ఉండే సంఖ్యలు.. మన ఫేవరెట్ మాత్రం 6 అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ఇద్దరు సిక్సర్ల వీరుల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇది చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా, రోహిత్, క్రిస్ గేల్‌లు 45 సంఖ్య జెర్సీలు ధరిస్తారన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆడుతూపాడుతూ 35 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ సెంచరీతో కదంతొక్కగా.. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రాణించారు.