వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడి టీమిండియాను గెలిపించాడు. ఆఫ్ఘనిస్తాన్ నిర్ధేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ సెంచరీతో కదంతొక్కితే, విరాట్ కోహ్లి (55 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు.
భారత గెలుపులో ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) తలో చేయి వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 4, హార్దిక్ 2, శార్దూల్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టాడు. ఛేదనలో సుడిగాలి శతకంతో విరుచుకుపడిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా హిట్‌మ్యాన్ మాట్లాడుతూ..
ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి పిచ్. నా సహజమైన ఆటను ఆడాను. క్రీజ్‌లో కుదురుకున్నాక పరుగులు రాబట్టడం తేలికవుతుందని తెలుసు. అందుకు తగ్గట్టుగా ఆడాను. ప్రపంచకప్‌లో సెంచరీ సాధించడం ఓ ప్రత్యేక అనుభూతి. సంతోషంగా ఉంది. రికార్డులపై (వరల్డ్‌కప్‌లలో అత్యధిక సెంచరీలు (7)) ఎక్కువ దృష్టి పెట్టను. అవి ఆటపై దృష్టిని మళ్లిస్తాయి. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో మంచి షాట్లు ఆడాను. ఛేజింగ్‌లో ఇలాంటి ఇన్నింగ్స్‌లే ఆడాలి. అప్పుడే విజయాలు సులువవుతాయి. కొన్ని సందర్భాల్లో బౌలర్లపై ఎదురుదాడి వర్కౌట్ అవుతుంది, కొన్ని సార్లు కాదు. ఏదిఏమైనా ప్రత్యర్ధిని ఒత్తిడికి గురి చేస్తూ ముందుకు సాగాలి.
విన్నింగ్ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఇది మాకు మంచి విజయం. టోర్నీ ప్రారంభంలో ఇలాంటి ఊపు లభించడం చాలా ముఖ్యం. ఒత్తిడిని అధిగమించి, మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు వాటంతటవే వస్తాయి. ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్దులకు ఓ మంచి స్పెల్ వస్తుంది. అలాంటి సమయంలోనే ఒత్తిడిని జయించాలి. ప్రస్తుత టోర్నీలో మేము ఇదే ఫార్ములాను అమలు చేశాము. జట్టు విషయానికొస్తే.. మా బృందంలో విభిన్న నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. సందర్భాన్ని బట్టి వారు తమ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. మా జట్టులో బెదురు లేని బ్యాటింగ్ చేయగల సమర్దులు ఉన్నారు, అలాగే చివరి గేమ్‌లోలా (ఆసీస్) ఒత్తిడిలో నిలకడ ప్రదర్శించగల ఘనాపాటిలు (కోహ్లి, రాహుల్‌ను ఉద్దేశిస్తూ) ఉన్నారు.
పాక్‌తో మ్యాచ్‌పై స్పందిస్తూ.. ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌కు ముందు మేము ఆటకు సంబంధించని విషయాల గురించి ఆలోచించం. ఏ అంశాలయితే మా నియంత్రణలో ఉంటాయో వాటి గురించే మేము ఆలోచిస్తాం. అంతిమంగా మేము మా సహజసిద్దమైన ఆటను ఆడి పాక్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment