టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో శుభారంభం చేసిన టీమిండియా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. తమ రెండో మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చింది. అఫ్గనిస్తాన్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో విజయానంతరం.. మరుసటి రోజే ప్రాక్టీస్ సెషన్‌తో బిజీగా గడిపింది.
ప్రత్యేకంగా ప్రాక్టీస్
ఫామ్‌లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా కూడా నెట్ సెషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెషన్‌లో సంజూ శాంసన్‌తో రిజర్వ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సంజూ శాంసన్ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు నెట్ సెషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. సంజూ బ్యాటింగ్‌ను వీరిద్దరు పరిశీలించినట్లు రెవ్‌స్పోర్ట్స్ వెల్లడించింది.
అతడిపై వేటు?
ఈ నేపథ్యంలో... టోర్నీ ఆరంభం నుంచి బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే స్థానంలో ఈ కేరళ బ్యాటర్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హిట్టర్‌గా ఐపీఎల్-2024లో ఇరగదీసిన శివం దూబే వరల్డ్‌కప్-2024లో మాత్రం బ్యాట్ ఝులిపించలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కలిపి 44 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 83.
అందుకే సంజూకు లైన్ క్లియర్
ఈ నేపథ్యంలో దూబేను తప్పించి సంజూకు మార్గం సుగమం చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది.
పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేకంటే ముందే తుదిజట్టులో ఈ మేరకు మార్పులతో ప్రయోగం చేయాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. మిడిలార్డర్‌లో ఉన్న ఒకే ఒక్క లెఫ్టాండర్ బ్యాటర్ శివం దూబే విషయంలో టీమిండియా రిస్క్ చేయకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా అంటిగ్వాలోని వివియన్ రిచర్ట్స్ స్టేడియంలో శనివారం టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉండటం ఆందోళనకరంగా పరిణమించింది.
చదవండి: టీమిండియా స్టార్ పేసర్ రీ ఎంట్రీకి సిద్ధం.. ఆ సిరీస్ నాటికి!
Barbados ✈️ Antigua #TeamIndia have arrived for today's Super 8 clash against Bangladesh 👌👌#T20WorldCup pic.twitter.com/RM54kEWP3W
— BCCI (@BCCI) June 22, 2024
Comments
Please login to add a commentAdd a comment