సొంతగడ్డపై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. గతకొంత కాలంగా బాజ్‌బాల్ అంటూ సంప్రాదయ క్రికెట్ రూపు రేఖలు మార్చేసిన ఇంగ్లండ్ జట్టుకు.. భారత్ సరైన గుణపాఠం నేర్పింది. వరుసగా మూడు టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆఖరి టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 259 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్.. 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ ఘోర ఓటమి చవిచూసింది.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో టీమిండియా ఘనంగా ముగించింది. ఇక ఈ అద్భుత విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్ అసాంతం అదరగొట్టిన యువ ఆటగాళ్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.
"టెస్టుల్లో ఇటువంటి విజయం సాధించాలంటే అన్ని ప్రణాళికలు సరిగ్గా అమలు కావాలి. సిరీస్ సొంతం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌లో మా కుర్రాళ్లు అదరగొట్టారు. వారికి అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. గానీ దేశీవాళీ క్రికెట్‌లో మాత్రం అపారమైన అనుభవం ఉంది. అందుకే తీవ్రమైన ఒత్తడిలో సైతం వారు అద్బుతంగా రాణించారు. ఈ సిరీస్ విజయం సాధించేందుకు మా జట్టు మొత్తం తీవ్రంగా శ్రమించింది.
కాబట్టి విన్నింగ్ క్రెడిట్ మా జట్టు మొత్తానికి ఇవ్వాలనకుంటున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సిరీస్ విజయం సాధిస్తే అందరూ సెంచరీలు, వ్యక్తిగత రికార్డుల కోసమే మాట్లాడతారు. కానీ ఒక టెస్టులో విజయం సాధించాలంటే 20 వికెట్లు తీయడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి బౌలర్ల కృషి లేనదే గెలుపొందడం చాలా కష్టం. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు.
ముఖ్యంగా స్పిన్నర్లు చాలా బాధ్యతాయుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ ప్రదర్శన కోసం ఎంతచెప్పుకున్న తక్కువే. మొదటి ఇన్నింగ్స్ ఆరంభంలో ఇంగ్లండ్ బ్యాటర్లు కాస్త దూకుడుగా ఆడుతున్నప్పుడు కుల్దీప్ యాదవ్‌ను ఎటాక్‌లో తీసుకురావాలని భావించాను. అందుకు తగ్గట్టే అతడు మాకు తొలి వికెట్‌ను అందించాడు. గాయం నుంచి కోలుకోని కుల్దీప్ ఈ తరహా ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. కుల్దీప్ బ్యాటింగ్ చేయడం కూడా మా జట్టుకు బాగా కలిసిచ్చోంది.
ఇక జైశ్వాల్ గురించి ఏమి మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. అతడొక సంచలనం. యశస్వీ ఇంకా తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిరోహించాలి. జైశ్వాల్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కోవడానికి జైశ్వాల్ ఎక్కువగా ఇష్టపడతాడు. అతడికి ఇదొక అద్బుతమైన సిరీస్ అని పోస్ట్ మ్యాచ్ ప్రేజంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ ఈ సిరీస్‌లో దుమ్మురేపాడు. 712 పరుగులతో ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా జైశ్వాల్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment