బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి సమయం సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియాకు చేరుకోవాలని సూచించాడు. జట్టుకు నాయకుడి అవసరం ఉందని.. ముఖ్యంగా ఇలాంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో కెప్టెన్ తోడుగా ఉంటే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందన్నాడు.
ఒకవేళ తాను గనుక రోహిత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఆస్ట్రేలియాకు వెళ్లేవాడినని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది.
కనీసం నాలుగు మ్యాచ్‌లైనా
ఇక కివీస్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ కావడంతో.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఆసీస్‌తో కనీసం నాలుగు మ్యాచ్‌లైనా కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆసీస్- టీమిండియా మధ్య ఈ సిరీస్ మొదలుకానుంది.
పండంటి మగబిడ్డ
అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే భారత ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి.. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. కాగా రోహిత్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు దూరం కానున్నాడనే వార్తలు వచ్చాయి. అతడి భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చే క్రమంలో.. భార్య ప్రసవం కోసం రోహిత్ ముంబైలోనే ఉంటాడని ప్రచారం జరిగింది.
అందుకు తగ్గట్లుగానే రితికా శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు రోహిత్ శర్మ ధ్రువీకరించాడు. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని భావిస్తున్నా. ఎందుకంటే.. జట్టుకు ఇప్పుడు నాయకుడి అవసరం ఎంతగానో ఉంది.
నేనే గనుక అతడి స్థానంలో ఉంటే..
అతడి భార్య శుక్రవారం రాత్రే మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసింది. కాబట్టి.. రోహిత్ ఇక ఆస్ట్రేలియాకు బయల్దేరవచ్చు. నేనే గనుక అతడి స్థానంలో ఉంటే.. ఇప్పటికే ఆసీస్‌కు పయనమయ్యేవాడిని.
తొలి టెస్టు ఆరంభానికి ముందు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఇదొక ప్రతిష్టాత్మక సిరీస్. రోహిత్ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లడం అత్యంత ముఖ్యం. జట్టుకు అతడి అవసరం ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడితేనే బాగుంటుందని గంగూలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన మ్యాక్స్‌వెల్.. అత్యంత వేగంగా..!
Comments
Please login to add a commentAdd a comment