ప్రకృతిని ఆస్వాదిస్తున్న రోహిత్ శర్మ(PC: Social Media)
ICC WC 2023- Rohit Sharma: అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఓటమి తర్వాత తొలిసారి ఇన్‌స్టా వేదికగా అందమైన ఫొటోను పంచుకున్నాడు. కాగా.. ఆసియా వన్డే కప్-2023 గెలిచిన టీమిండియా సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ కూడా గెలిచి సత్తా చాటుతుందని అభిమానులు భావించారు.
సమిష్టి ప్రదర్శనతో సెమీస్‌కు
అందుకు తగ్గట్లుగానే లీగ్ దశలో భారత జట్టు ఎదురులేని విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్, వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించారు.
అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. పేస్ త్రయం జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ అదరగొట్టడంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ఇక న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లోనూ సమిష్టి కృషితో గెలుపొందిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో పోటీపడింది.
ఆఖరి మెట్టుపై బోల్తా
అయితే, అసలు పోరులో ఒత్తిడిని జయించలేక ఓటమిపాలైంది. అహ్మదాబాద్ మైదానంలో లక్ష పైచిలుకు అభిమానుల మధ్య భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత జట్టు ఓటమిపాలై టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయింది. దీంతో జట్టుతో పాటు టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలైపోయాయి.
కన్నీళ్లను దిగమింగి
కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. ఇక తనకు అనధికారికంగా ఇదే ఆఖరి వన్డే వరల్డ్‌కప్ కావడం.. ఇక్కడిదాకా వచ్చి కూడా ట్రోఫీ చేజారడంతో 36 ఏళ్ల రోహిత్ మరింత కుంగిపోయాడు. చేతులతో ముఖం దాచుకుంటూ కన్నీళ్లను ఆపుకొనే ప్రయత్నం చేశాడు.
ఈ దృశ్యాలు చూసి రోహిత్ ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మరేం పర్లేదు హిట్‌మ్యాన్.. ఆటలో గెలుపోటములు సహజం’’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాడికి అండగా నిలిచారు. అప్పటి నుంచి రోహిత్ ఎప్పుడెప్పుడు స్పందిస్తాడా అని ఆశగా ఎదురుచూశారు.
సెలవుల్లో రోహిత్ శర్మ
ఈ క్రమంలో భార్య రితికా సజ్దేతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్న రోహిత్.. చెట్ల మధ్య ఉన్న మట్టిబాటలో భార్యతో కలిసి నడుస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ నడుస్తూ ఉన్న ఈ ఫొటో వైరల్‌గా మారింది.
కాగా వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ సహా మిగతా సీనియర్లు విశ్రాంతి తీసుకుంటుండగా.. యువ జట్టు సూర్యకుమార్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. తదుపరి మంగళవారం మూడో టీ20 ఆడనుంది సూర్యసేన.
చదవండి: Ind vs Aus: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్ రికార్డు బద్దలు! తొలి భారత బ్యాటర్‌గా..
A beautiful Instagram story by Rohit Sharma. pic.twitter.com/HPVjT6ihMm
— Johns. (@CricCrazyJohns) November 26, 2023
Comments
Please login to add a commentAdd a comment