
రాయ్‌పూర్: టీమిండియా క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డుల రారాజుగా పిలుస్తారనడంలో సందేహం లేదు. వన్డేల్లో, టెస్టుల్లో అత్యధిక పరుగులు.. టెస్టులు, వన్డేలు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇలా ఎవరికి సాధ్యం కాని రికార్డులు నమోదు చేశాడు. అలాంటి సచిన్‌కు ఈరోజు(మార్చి 16) ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సరిగ్గా ఇదే రోజున(మార్చి 16, 2012) బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో తన 100వ సెంచరీని సాధించాడు.
మీర్పూర్ షేర్-ఏ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో సచిన్ ఈ ఘనత అందుకోవడం విశేషం. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో సచిన్ 147 బంతుల్లో 114 పరుగులు చేయగా.. బంగ్లా ముందు టీమిండియా 290 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. నాలుగు బంతులు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ విజయం తన ఖాతాలో వేసుకున్నది. తాజాగా రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో ఆడుతున్న సచిన్‌కు ఇండియా లెజెండ్స్ ఆటగాళ్లు కంగ్రాట్స్ చెబుతూ అతని చేత కేక్ కట్ చేయించారు. ఇండియా లెజెండ్స్ ఆటగాళ్లైన యువరాజ్, సెహ్వాగ్, ఇర్ఫాన్, యూసఫ్ పఠాన్.. తదితర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలుపుతూ..''రోజు వేరు కావొచ్చు.. కానీ సెలబ్రేషన్‌కు కారణం మాత్రం ఒకటే.. కంగ్రాట్స్ పాజీ'' అంటూ ట్వీట్ చేశారు.దీనికి సంబందించిన వీడియోను ప్రగ్యాన్ ఓజా తన ట్విటర్‌లో షేర్ చేశాడు.
సచిన్‌కు 100 వ అంతర్జాతీయ సెంచరీ సాధించడం అంత సులభమేం కాలేదు. ఎందుకంటే అతను ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు ఒక ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది. 2011 మార్చిలో దక్షిణాఫ్రికాపై 99వ సెంచరీ చేసిన సచిన్.. ఆ తర్వాత రెండు సందర్బాల్లో 90 పరుగుల వద్ద అవుటయ్యాడు. మార్చి 18 న సచిన్ వన్డే కెరీర్‌లో తన చివరి మ్యాచ్‌ను.. ఆఖరి అంతర్జాతీయ మ్యచ్‌ను ఆడాడు.మాస్టర్ ఆ మైలురాయిని సాధించి 9సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ రికార్డు పదిలంగా ఉండడం విశేషం. కాగా, ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 70 సెంచరీలు సాధించాడు. టీమిండియా తరపున సచిన్ 463 వన్డేల్లో 18426 పరుగులు.. 200 టెస్టుల్లో 15921 పరుగులు.. వన్డే, టెస్టులు కలిపి వంద సెంచరీలు( వన్డేల్లో 49, టెస్టుల్లో 51) సాధించాడు.
చదవండి:
సిక్సర్లతో యువీ, బౌండరీలతో సచిన్..
వయసు పెరిగినా పదును మాత్రం తగ్గలేదు
Different day but the reason remains the same. Celebrating @sachin_rt paaji’s 100th 100. pic.twitter.com/gKvubhsBHI
— Pragyan Ojha (@pragyanojha) March 16, 2021