IND vs AUS: రెండో టెస్ట్‌కూ గిల్‌ అనుమానమే..? | Shubman Gill Doubtful For Second Test Against Australia, Might Miss Match Against Prime Minister XI Says Report | Sakshi
Sakshi News home page

IND vs AUS: రెండో టెస్ట్‌కూ గిల్‌ అనుమానమే..?

Published Wed, Nov 27 2024 10:53 AM | Last Updated on Wed, Nov 27 2024 11:23 AM

Shubman Gill Doubtful For Second Test Against Australia, Might Miss Match Against Prime Minister XI Says Report

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయపడిన విషయం తెలిసిందే. ప్రాక్టీస్‌ సందర్భంగా గిల్‌ ఎడమ చేతి బొటన వేలు ప్రాక్చర్‌ అయ్యింది. ఈ కారణంగా అతను పెర్త్‌ టెస్ట్‌కు (తొలి టెస్ట్‌) దూరమయ్యాడు. డాక్టర్లు గిల్‌కు రెండు వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గిల్‌ రెండో టెస్ట్‌కు కూడా దూరం అవుతాడని తెలుస్తుంది. 

గిల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా రెండో టెస్ట్‌కు తగినంత ప్రాక్టీస్‌ అవసరమని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భావిస్తుందట. అందుకు అతన్ని పరిగణలోకి తీసుకోవడం​ లేదని సమాచారం. గిల్‌ రెండో టెస్ట్‌కు ముందు జరిగే రెండు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కూడా పాల్గొనడని తెలుస్తుంది. పింక్‌ బాల్‌తో జరిగే ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నవంబర్‌ 30, డిసెంబర్‌ 1 తేదీల్లో జరుగనుంది. 

ఒకవేళ రెండో టెస్ట్‌కు గిల్‌ దూరమైతే తొలి టెస్ట్‌లో ఓపెనింగ్‌ చేసిన కేఎల్‌ రాహుల్‌ వన్‌ డౌన్‌లో బరిలోకి దిగుతాడు. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన దేవ్‌దత్‌ పడిక్కల్‌ జట్టు నుంచి తప్పించబడతాడు. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.

గిల్‌ అందుబాటులోకి వస్తే..
గిల్‌ గాయం నుంచి కోలుకునే సమయం డిసెంబర్‌ 1తో ముగుస్తుంది. ఒకవేళ టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎలాంటి ప్రాక్టీస్‌ లేకపోయినా గిల్‌ను బరిలోకి దించాలని భావిస్తే, రెండో టెస్ట్‌లో అతను పడిక్కల్‌ స్థానంలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడు. 

యశస్వికి జతగా రోహిత్‌ అందుబాటులో ఉంటాడు కాబట్టి రాహుల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడు. గిల్‌ రెండో టెస్ట్‌లో బరిలో​​కి దిగితే అడిలైడ్‌ ఓవల్‌ మైదానంలో అతనికి మొదటి టెస్ట్‌ అవుతుంది. గిల్‌ గత పర్యటనలో మెల్‌బోర్న్‌, సిడ్నీ, బ్రిస్బేన్‌లలో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. అడిలైడ్‌ వేదికగా జరిగే రెండో టెస్ట్‌ పింక్‌ బాల్‌తో జరుగనున్న విషయం తెలిసిందే.

తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే పరిమితమైన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని ఆసీస్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ సమిష్టిగా రాణించి ఆసీస్‌ను గెలుపు దరిదాపుల్లోకి కూడా చేరనివ్వలేదు. ఈ మ్యాచ్‌ బుమ్రా 8 వికెట్లు పడగొట్టగా.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి సూపర్‌ సెంచరీలతో మెరిశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement