'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది' | Shubman Gill Father Reacts About Missing Century In Brisbane Test | Sakshi
Sakshi News home page

'నా కొడుకు సెంచరీ చేసుంటే బాగుండేది'

Published Wed, Jan 20 2021 3:41 PM | Last Updated on Wed, Jan 20 2021 6:11 PM

Shubman Gill Father Reacts About Missing Century In Brisbane Test - Sakshi

బ్రిస్బేన్‌: ఆసీస్‌ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలుచుకున్న క్షణం నుంచి ఇప్పటిదాకా అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే ఆసీస్‌ విధించిన 328 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా 7 వికెట్లు కోల్పోయి చేధించిన సంగతి తెలిసిందే. రిషబ్‌ పంత్‌ కడదాకా నిలిచి 89* పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంత్‌కు తోడుగా పుజారా వికెట్లు కోల్పో​కుండా అడ్డు గోడగా నిలిచాడు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత రిషబ్‌ పంత్‌, పుజారాలను ఆకాశానికి ఎత్తడం అందరూ గమనించారు. అయితే ఇక్కడ మరో ఆటగాడు భారత్‌ నాలుగో టెస్టు గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. 91 పరుగులు చేసి భారత విజయానికి బాటలు పరిచాడు. 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్న గిల్‌ ఇన్నింగ్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది.

గిల్‌ ఇన్నింగ్స్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నవేళ.. గిల్‌ తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ మాత్రం తన కొడుకు సెంచరీ మిస్‌ అయినందుకు బాధపడ్డాడు. 'గిల్ ఆడిన ఇన్నింగ్స్‌ టీమిండియా క్రికెట్‌ చరిత్రలో కొన్ని ఏళ్ల పాటు గర్తుండిపోతుంది. నా కొడుకు ఇన్నింగ్స్‌ నాకు ప్రత్యేకం.. కానీ దానిని సెంచరీగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. 91 పరుగుల వరకు వచ్చి కేవలం 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోవడం కాస్త బాధ కలిగించింది. అయినా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే చిరస్మరణీయ విజయంలో నా కుమారుడు భాగస్వామ్యం కావడం  ఆ బాధను మరిచేలా చేసింది. అయితే గిల్‌ ఔటైన విధానం నన్ను కలవరపరిచింది. అంత మంచి ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌ ఆఫ్‌ స్టంప్‌కు  దూరంగా వెళ్తున్న బంతిని టచ్‌ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. కానీ ఇది అతనికి మంచి అనుభవం.. రానున్న మ్యాచ్‌ల్లో ఇది రిపీట్‌ కాకుండా చూసుకుంటాడని ఆశిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: దిగ్గజాలు ఇప్పుడేం సమాధానం ఇస్తారు!

గిల్‌ తండ్రి లఖ్వీందర్‌ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'భారతదేశ సగటు తండ్రి ఆవేదన ఇలాగే ఉంటుంది. ఎంతైనా ఒక కొడుకుకు తండ్రే కదా.. మీరు అలా ఆలోచించడంలో ఏ మాత్రం తప్పులేదు. అయినా గిల్ 91 పరుగులతో‌ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఆనందం ముందు 100 పరుగులు మిస్‌ కావడం పెద్ద విషయం కాదు' అంటూ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement