వెస్టిండీస్ చేతిలో తొలి టీ20లో ఎదురైన పరాభవానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. దంబుల్లా వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నామమాత్రపు స్కోరుకే పరిమితమైనా.. బౌలర్ల విజృంభణ కారణంగా జయకేతనం ఎగురవేసింది. విండీస్‌ను 73 పరుగుల తేడాతో చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం
కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు వెస్టిండీస్ జట్టు శ్రీలంక పర్యటనకు వచ్చింది. పొట్టి సిరీస్‌కు దంబుల్లా, వన్డే సిరీస్‌కు పల్లెకెలె ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తొలి టీ20లో విండీస్ గెలవగా.. మంగళవారం శ్రీలంక జయభేరి మోగించింది.
నిసాంక హాఫ్ సెంచరీ
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్,ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పాతుమ్ నిసాంక (49 బంతుల్లో 54; 9 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీతో రాణించగా... కుశాల్ మెండిస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), కుశాల్ పెరీరా (24; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు.
బౌలర్లు పడగొట్టేశారు
ఇక విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 16.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రావ్‌మన్ పావెల్ (17 బంతుల్లో 20; ఒక ఫోర్, ఒక సిక్స్) టాప్ స్కోరర్. బ్రాండన్ కింగ్ (5), ఎవిన్ లూయిస్ (7), ఆండ్రూ ఫ్లెచర్ (4), రోస్టన్ చేజ్ (0) పూర్తిగా విఫలమయ్యారు.
శ్రీలంక బౌలర్లలో టీ20 అరంగేట్ర ఆటగాడు దునిత్ వెల్లలాగె 3, మహీశ్ తీక్షణ, అసలంక, హసరంగ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లోని చివరిదైన మూడో టీ20 గురువారం జరుగనుంది.
చదవండి: T20 WC: భారత్ అవుట్!.. ఇంత చెత్తగా ఆడతారా?: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment