![Someone needs to have chat with him: Mark Taylor on Mohammed Sirajs celebrappeals](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/11/Untitled-1_0.jpg.webp?itok=TCphxxlF)
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ సమయంలో చేసుకునే అనుచిత సంబరాలపై సీనియర్లు నచ్చజెబితే బాగుంటుందని ఆ్రస్టేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో సిరాజ్ చేస్తున్న పదేపదే అప్పీళ్లపై, ముందస్తు సంబరాలపై పలువురు ఆస్ట్రేలియన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
మాజీ కెప్టెన్ టేలర్ మాట్లాడుతూ భారత సీనియర్లే తమ పేసర్‌ను నియంత్రించాలన్నాడు. కొన్ని సందర్భాల్లో సిరాజ్ అప్పీల్ చేసి అంతటితో ఆగట్లేదు! అంపైర్ నిర్ణయం వెలువరించకపోయినా... తను మాత్రం వికెట్ తీసినట్లుగా సంబరాలు చేసుకోవడం కంగారూ క్రికెటర్లను అసహనానికి గురి చేస్తోంది.
‘సిరాజ్‌కు తోటి సీనియర్లే సర్దిచెప్పాలి. ఒక్క ట్రవిస్ హెడ్ అవుట్ విషయంలోనే కాదు... పదేపదే అతను అప్పీల్ చేయడం. అవుటయ్యాడా... నాటౌట్‌గా ఉన్నాడా అనే కనీస విచక్షణ కూడా మరిచి... అంపైర్ వేలు ఎత్తకపోయినా (నిర్ణయం) తను చేసుకునే పరిపక్వత లేని సంబరాలు చూసేందుకు ఏమాత్రం బాగోలేవు. ఇది ఆటకు కూడా అంత మంచిది కాదని నా అభిప్రాయం’ అని టేలర్ అన్నాడు.
సిరాజ్ మంచి బౌలరని చెప్పుకొచ్చిన మాజీ కెపె్టన్ అతని ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని చెప్పాడు. ‘బౌలింగ్‌లో అతని ఉత్సాహం నన్ను ఆకట్టుకుంటుంది. తన పోటీతత్వాన్ని ఇష్టపడతాను. ఇరు జట్ల మధ్య మంచి సిరీస్ జరుగుతుంటే సిరాజ్ ఆటను కూడా గౌరవించాలి కదా.
ఇదే విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా సహచరులు చెప్పాలి’ అని టేలర్ చెప్పాడు. మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ హెడ్ అవుటైనపుడు చేసిన సంజ్ఞల కంటే కూడా మితిమీరిన అప్పీళ్లకే రిఫరీ శిక్ష వేయాలని అన్నాడు.
చదవండి: అభిషేక్ శర్మ విధ్వంసం
మాజీ బ్యాటర్ సైమన్ కటిచ్ మాట్లాడుతూ సిరాజ్‌కు ఆ క్షణంలో (హెడ్ అవుటైనపుడు) బుర్ర దొబ్బిందో ఏమో! లేకపోతే ఆ సమయంలో శ్రుతిమించిన సంబరాలెందుకు చేసుకుంటాడని అన్నాడు. సిరాజ్ చికాకు తెప్పించాడని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment