
2011 తర్వాత టీమిండియా ఆడిన ఐసీసీ మేజర్ టోర్నీలో నాకౌట్ దశలోనే వెనుదిరుగుతూ వచ్చింది. 2012 చాంపియన్స్ ట్రోపీ మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన 2016 టి20 వరల్డ్‌కప్, 2015 వన్డే వరల్డ్‌కప్, 2017 చాంపియన్స్ ట్రోపీ, 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టి20 వరల్డ్‌కప్(లీగ్ దశలోనే), 2022 టి20 ప్రపంచకప్‌లు.. ఇలా ఏది చూసుకున్నా నాకౌట్ దశలోనే ఇంటిదారి పట్టింది.
ఇక అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతుంది. ఈసారి కచ్చితంగా రోహిత్ సేన కప్ కొడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇక బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం తన 51వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకౌట్‌లో భారత జట్టు ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2013లో ధోనీ నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫిని గెలిచుకున్న తర్వాత భారత్ మరే ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. అప్పటి నుంచి టీమిండియా నాలుగు ఫైనల్స్‌లో ఓడిపోగా.. ఇంకొన్ని సార్లు సెమీఫైనల్ వరకు వెళ్లింది. భారత్ వైఫల్యాలకు కారణం మానసిక ఒత్తిడి కంటే ఎగ్జిక్యూషన్ లేకపోవడమేనన్నారు. తాము కీలకమైన దశలలో కొన్నిసార్లు బాగా రాణించలేదని.. దీనిని మానసిక ఒత్తిడిగా తాను పరిగణించడం లేదన్నారు. మానసికంగా టీమిండియా ఆటగాళ్లు చాలా దృఢమైన వ్యక్తులని.. వారు త్వరలోనే ఈ అడ్డు రేఖను దాటుతారని దాదా ఆకాంక్షించారు.
త్వరలో భారత్ వేదికగా ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి నాకౌట్ దశలో అద్భుతంగా రాణిస్తుందన్నారు. భారత్ కనీసం డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించిందని.. ఇది కూడా ఒక ఘనతేనని గంగూలీ పేర్కొన్నారు. జట్టులో మంచి ఆటగాళ్లున్నారని.. ఈసారి రాణిస్తారని ఆయన జోస్యం చెప్పారు.