శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్‌విల్లా( Niroshan Dickwella)కు భారీ ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ(WADA) అతడికి క్లీన్‌చిట్ దక్కినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిక్‌విల్లాపై ఉన్న మూడేళ్ల నిషేధాన్ని ఎత్తివేసినట్లు తెలుస్తోంది. శ్రీలంక ప్రీమియర్ లీగ్-2024 సందర్భంగా డిక్‌విల్లాపై డోపింగ్ ఆరోపణలు వచ్చాయి.
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన ఆట తీరును మెరుగుపరచుకునేందుకు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు శ్రీలంక యాంటీ డోపింగ్ ఏజెన్సీ(SLADA)కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్‌విల్లాకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్ ఆడకుండా మూడేళ్లపాటు నిషేధం పడింది.
ఈ నేపథ్యంలో నిరోషన్ డిక్‌విల్లా వాడాను ఆశ్రయించగా.. అతడికి ఊరట లభించినట్లు డైలీ మిర్రర్ లంక పేర్కొంది. డిక్‌విల్లా నిషేధిత ప్రేరకాలు వాడలేదని.. అతడు తీసుకున్న పదార్థాలతో బ్యాటింగ్ ప్రదర్శన మెరుగుపడే అవకాశం లేదని లీగల్ టీమ్ ఆధారాలు సమర్పించినట్లు తెలిపింది. ఫలితంగా నిరోషన్ డిక్‌విల్లాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా వాడా ఆదేశించినట్లు పేర్కొంది.
కాగా 31 ఏళ్ల నిరోషన్ డిక్‌విల్లా 2014లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటి వరకు 54 టెస్టులు, 55 వన్డేలు, 28 టీ20లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2757, 1604, 480 పరుగులు సాధించాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడన్న కారణంగా నిషేధం ఎదుర్కోవడం అతడికి అలవాటే.
కోవిడ్ సమయంలో 2021లో బయో బబుల్ నిబంధనలు అతిక్రమించినందుకు నిరోషన్ డిక్‌విల్లాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడింది. అతడితో పాటు ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్ కూడా ఇదే తప్పిదం కారణంగా నిషేధం ఎదుర్కొన్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టు సందర్భంగా నిరోషన్ డిక్‌విల్లా శ్రీలంక తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌కే అతడు పరిమితమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment