ICC Cricket World Cup 2023 - Rohit Sharma Comments: వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా వరుస విజయాల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సారథిగా వ్యూహాత్మకంగా జట్టును ముందుకు నడిపిస్తూనే.. కష్టాల్లో ఉన్న వేళ బ్యాట్ ఝలిపిస్తూ ఆటగాడిగానూ ఆకట్టుకుంటున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో జట్టు అజేయంగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ఇప్పటికే రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో సొంతమైదానం ముంబైలోని వాంఖడే వేదికగా కీలక మ్యాచ్‌కు తన జట్టుతో కలిసి సిద్ధమయ్యాడు రోహిత్ శర్మ.
లంకపై గెలిస్తే సెమీస్‌కు
ఇక శ్రీలంకతో గురువారం నాటి మ్యాచ్ గెలిస్తే.. భారత్ నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టడం ఖాయమవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రతి మ్యాచ్ కీలకమే.. విజయాల వెనుక రహస్యం అదే
‘‘ఈ విజయాలు నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదు. జట్టు సమిష్టి కృషితోనే ఇక్కడిదాకా వచ్చాము. అన్నీ బాగున్నపుడు.. అంతా బాగానే కనిపిస్తుంది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అందరికీ సంతోషమే.
అయితే, వీటన్నింటి వెనుక మా కష్టం ఎంత ఉందో నాకు తెలుసు. ప్రతి ఒక్క మ్యాచ్ మాకు కీలకమే. ఇప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి ఒకే. లేదంటే నాపై చెత్త కెప్టెన్ అనే ముద్ర పడటానికి ఎంతో సేపు పట్టదు.
అలా అయితే బ్యాడ్ కెప్టెన్ అయిపోతానని తెలుసు
ఇక్కడి నుంచి ఏ చిన్న పొరపాటు జరిగినా.. అకస్మాత్తుగా నేను బ్యాడ్ కెప్టెన్ అయిపోతాను. కాబట్టి జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. విజయాలకు అవసరమైన ప్రణాళికలు రచించడంపై మాత్రమే నా దృష్టి కేంద్రీకరించాను.
వరల్డ్‌కప్ ఆసాంతం అజేయంగా ఉండటమే మా లక్ష్యం. ఈ మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ మరింత జాగ్రత్తగా ఆడాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వరుస విజయాల నేపథ్యంలో తనను ప్రశంసిస్తున్న వాళ్లే.. వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచే ప్రయాణంలో గనుక ఆటుపోట్లు ఎదురైతే తనను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడరని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.
గొప్ప కెప్టెన్ అన్న నోటితోనే చెత్త కెప్టెన్ అనడానికి ఒక్క మ్యాచ్ ఫలితం చాలని పేర్కొన్నాడు. కాబట్టి తను ప్రతి మ్యాచ్‌ను సీరియస్‌గానే తీసుకుంటానని స్పష్టం చేశాడు. కాగా లీగ్ దశలో శ్రీలంక తర్వాత.. టీమిండియా సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
చదవండి: రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!
Comments
Please login to add a commentAdd a comment