ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని ముద్దాడిన క్షణాలను తలచుకుంటూ హిట్‌మ్యాన్ కుటుంబం సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.
ఇలాంటి సంతోషకర సమయంలో కొద్ది మంది నెటిజన్లు మాత్రం రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రులంటే అతడికి ఏమాత్రం గౌరవం లేదంటూ ఇష్టారీతిన ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మందేమో ఈ విషయంలో విరాట్ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ అతడినీ విమర్శిస్తున్నారు.
అమెరికా- వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
తద్వారా భారత్ ఖాతాలో పదమూడేళ్ల తర్వాత మరో వరల్డ్‌కప్ ట్రోఫీ చేరింది. టైటిళ్ల సంఖ్య నాలుగైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైకి పయనమైన రోహిత్ సేన బస్ పెరేడ్‌లో పాల్గొంది.
అదే విధంగా.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ చిరస్మణీయ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సైతం ఈ ఆనందోత్సవంలో భాగమయ్యారు.
ఈ క్రమంలో కుమారుడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె.. ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. అయితే, అందుకు ప్రతిగా రోహిత్ శర్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.
‘‘ఇక చాల్లే.. అందరూ చూస్తున్నారమ్మా’’ అన్నట్లుగా బిడియం ప్రదర్శించిన రోహిత్.. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఈ క్రమంలో కొంతమంది రోహిత్‌ను టార్గెట్ చేశారు. ‘‘భార్య, కూతురితో ఉన్నంత అనుబంధం తల్లితో లేదా? ఆమె అంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇలా చేయడం అస్సలు బాలేదు’’ అని విమర్శిస్తున్నారు.
ఇక మరికొంత మందేమో.. ‘‘రోహిత్ కనీసం తన తల్లిదండ్రులనైనా ఇక్కడిదాకా తీసుకువచ్చాడు. కోహ్లి అయితే భార్యను తప్ప తల్లిని ఏనాడూ ఎక్కడికీ తీసుకురాడు’’ అని ట్రోల్ చేస్తున్నారు.
అప్పుడే తన నిర్ణయం చెప్పాడు
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సాధించిన విజయం పట్ల అతడి తల్లి పూర్ణిమ శర్మ స్పందించారు. ‘‘ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.
వరల్డ్‌కప్ ఆడేందుకు వెళ్లే కంటే ముందు రోహిత్ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
గెలిచినా.. ఓడినా తన ఆలోచనలో మార్పు ఉండదని చెప్పాడు. అప్పుడు నేను గెలవడానికి ప్రయత్నించు అని మాత్రమే చెప్పగలిగాను. నిజానికి ఇప్పుడు కూడా నా ఆరోగ్యం అంతగా బాలేదు. అయితే, డాక్టర్ అప్పాయింట్‌మెంట్ మిస్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చాను’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారు.
Such a sweet moment between Rohit Sharma and his mom 🥹❤️ pic.twitter.com/u8hXhr3LVL
— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024
Comments
Please login to add a commentAdd a comment