ICC WC 2023- Semis Race: వన్డే వరల్డ్‌కప్-2023లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా వరుస విజయాలతో జోరు మీదుంది. సొంతగడ్డపై మరోసారి ట్రోఫీని ముద్దాడేందుకు అద్భుతమైన ఆట తీరుతో.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది.
ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లకు గానూ ఆరింట గెలుపొందిన రోహిత్ సేన దాదాపుగా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే, అధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాలంటే అవసరమైన సమీకరణలేంటో చూద్దాం!
టాప్‌లో టీమిండియా
టీమిండియా ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లలో గెలుపొంది 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆరింట ఐదు గెలిచిన సౌతాఫ్రికా 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అయితే, రన్‌రేటు పరంగా టీమిండియా కంటే సఫారీలు ఎంతో మెరుగ్గా ఉన్నారు.
ఇక గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ 8 పాయింట్లు, ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా 8 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అఫ్గనిస్తాన్ 6 పాయింట్లతో ఐదో స్థానంలోకి దూసుకువచ్చింది.
అఫ్గనిస్తాన్ అద్భుత విజయాలతో
ఇదిలా ఉంటే.. టీమిండియాకు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. లీగ్ దశలో శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌తో రోహిత్ సేన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడింటికి మూడు ఓడిపోయినా.. 12 పాయింట్లతో టీమిండియా సేఫ్ జోన్‌లోనే ఉంటుంది.
ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు కచ్చితంగా గెలవాలి. అందులోనూ అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోకూడదు. అలా అయితే, కివీస్‌తో పాటుగా 12 పాయింట్లతో టాప్-4లో నిలిచేందుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
ఇక రన్‌రేటు విషయంలో టాప్‌లో ఉన్న సౌతాఫ్రికా కూడా తమకు మిగిలిన మూడు మ్యాచ్‌ల(టీమిండియాతో సహా)లో కనీసం ఒకటి గెలవాలి. అప్పుడు ప్రొటిస్ జట్టు సైతం 12 పాయింట్లతో ఉంటుంది. అదే విధంగా అఫ్గనిస్తాన్ తమకు మిగిలిన మూడు మ్యాచ్‌లలో మూడూ గనుక భారీ తేడాతో గెలిస్తే 12 పాయింట్లు సాధించడంతో పాటు రన్‌రేటు మెరుగవుతుంది.
జాగ్రత్తగా ఉండాలి
ఇలాంటపుడు టీమిండియా గనుక మూడు ఓడిపోతే.. సౌతాఫ్రికా, ఆసీస్, కివీస్‌లు ముందుకు దూసుకువస్తే పోటీలో వెనుకబడే పరిస్థితి వస్తుంది. అంతేకాదు.. శ్రీలంక, పాకిస్తాన్ సైతం ఇంకా రేసు నుంచి పూర్తిగా నిష్క్రమించలేదు.
కాబట్టి పటిష్ట స్థితిలో ఉన్నామనే భావనతో రోహిత్ సేన ఏమాత్రం రిలాక్స్ అయినా ప్రమాదం తప్పదు. మిగిలిన మూడు మ్యాచ్‌లలో మూడూ గెలిచి.. సగర్వంగా టాప్‌లో నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టడం సహా ఫైనల్ చేరి.. అక్కడ కూడా జయభేరి మోగించి ట్రోఫీని ముద్దాడాలంటే మరింత జాగరూకత అవసరం.
చదవండి: అప్పుడు ద్రవిడ్ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్ మాలిక్
Comments
Please login to add a commentAdd a comment