
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు చేదు వార్త వినిపిస్తుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రాబోయే సీజన్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న స్కై.. ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువేనని ముంబై ఇండియన్స్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న సూర్యకుమార్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇంకా మొదలుపెట్టలేదని తెలుస్తుంది. స్కై ఇటీవల తన ఫిట్‌నెస్‌ను రివీల్ చేస్తే కొన్ని వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినప్పటికీ.. వాటిలో ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనపడలేదు. దీంతో అతను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదన్న విషయం స్పష్టమైంది.
ఎన్‌సీఏ వైద్య బృందం సైతం స్కైకు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్ అయిన స్కై.. ఎంఐ ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైతే దాని ప్రభావం ఆ జట్టుపై భారీగా పడే అవకాశం ఉంటుంది. ఐపీఎల్ ప్రారంభానికి 10 రోజులు, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు మరో 12 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో స్కై పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడో లేదో వేచి చూడాలి.
కాగా, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్‌ను ఢీకొట్టనుంది. గుజరాత్ నుంచి వలస వచ్చిన హార్దిక్ ఈ సీజన్‌లో ముంబై ఇండయన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతను తన తొలి మ్యాచ్‌లోనే తన మాజీ జట్టుతో తలపడాల్సి ఉండటం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకంటే చాలా జూనియర్ అయిన హార్దిక్ సారథ్యంలో సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడో లేదో అన్న అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ చివరి రోజు ఆటలో రోహిత్ బరిలోకి దిగకపోవడాన్ని బట్టి చూస్తే, అతను ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు హ్యాండ్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్‌కు చెందిన మరో స్టార్ ఆటగాడు, టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా హార్దిక్ సారథ్యంలో ఆడేందుకు ముందు నుంచే ససేమిరా అంటున్నాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 2024 ఐపీఎల్ సీజన్.. మార్చి 22న సీఎస్‌కే-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది.