
16 వేలకు పైగా టిక్కెట్లు అందుబాటులో ఉంచాము. కానీ...
ICC Issues Apology Fans Without Tickets Enters Stadium: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య దుబాయ్‌లో అక్టోబరు 29న మ్యాచ్ సందర్బంగా అభిమానులు గందరగోళం సృష్టించారు. కొంతమంది టికెట్లు లేకుండానే స్టేడియంలో ప్రవేశించారు. దీంతో టికెట్ కొని మ్యాచ్‌ను వీక్షిద్దామనుకున్న ప్రేక్షకులకు ఇబ్బంది ఎదురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఘటనపై స్పందించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విచారం వ్యక్తం చేసింది. టికెట్లు కొన్న వారికి అంతరాయం కలిగినందుకు క్షమాపణ తెలియజేసింది. ఈ మేరకు.. ‘‘పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో 16 వేలకు పైగా టిక్కెట్లు అందుబాటులో ఉంచాము. కానీ... టిక్కెట్లు లేకుండానే వేలాది మంది అభిమానులు మ్యాచ్ వేదిక వద్దకు వచ్చి... బలవంతంగా మైదానంలోకి ప్రవేశించేందుకు యత్నించారు.
అయితే, దుబాయ్ పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు’’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సిందిగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని ఆదేశించినట్లు పేర్కొంది. టిక్కెట్లు కొని మ్యాచ్ చూద్దామని వచ్చిన ప్రేక్షకులకు ఇబ్బంది కలిగినందుకు ఐసీసీ, ఈసీబీ క్షమాపణ కోరుతున్నాయని పేర్కొంది.
చదవండి: T20 World Cup 2021 Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్‌లో ఆ రెండు జట్లే: స్టోక్స్