టీ20 వరల్డ్‌కప్ 2024 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు ఓడింది. ట్రినిడాడ్ వేదికగా ఇవాళ (జూన్ 27) జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా తొలిసారి వరల్డ్‌కప్ టోర్నీల్లో (వన్డే, టీ20) ఫైనల్‌కు చేరింది.
రెచ్చిపోయిన సఫారీ బౌలర్లు.. చేతులెత్తేసిన ఆఫ్ఘన్ బ్యాటర్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 56 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు విరుచుకుపడటంతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. జన్సెన్ (3-0-16-3), షంషి (1.5-0-6-3), రబాడ (3-1-14-2), నోర్జే (3-0-7-2) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌ను కకావికలం చేశారు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే (అజ్మతుల్లా (10)) రెండంకెల స్కోర్ చేయగలిగారంటే సఫారీ పేసర్లు ఏరకంగా రెచ్చిపోయారో అర్దమవుతుంది. గుర్బాజ్ (0), జద్రాన్ (2), గుల్బదిన్ నైబ్ (9), నబీ (0), ఖరోటే (2), కరీమ్ జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (0), నవీన్ ఉల్ హక్ (2) దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన పరుగులు అత్యధికం (13) కావడం విశేషం.
ఆడుతూ పాడుతూ..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి విజయతీరాలకు చేరింది. డికాక్ 5 పరుగులు చేసి ఫజల్ హక్ ఫారూఖీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. రీజా హెండ్రిక్స్ (29), మార్క్రమ్ (23) సౌతాఫ్రికాను గెలుపు తీరాలు దాటించారు.
Comments
Please login to add a commentAdd a comment