
సబలెంక జీవితంలో తీవ్ర విషాదం (PC: sabalenka_aryna)
టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక వ్యక్తిగత జీవితంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె బాయ్‌ఫ్రెండ్, ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ హఠాన్మరణం చెందాడు. 42 ఏళ్ల వయసులో అతడు కన్నుమూశాడు.
బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది. కొల్త్సోవ్ ఆకస్మిక మరణం తమను తీవ్ర విషాదంలో ముంచివేసిందని పేర్కొంది. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లకు ప్రగాభ సానుభూతి తెలియజేసింది.
అయితే, కొల్త్సోవ్ మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ 2002- 2010 మధ్య హాకీ ప్లేయర్‌గా రాణించాడు. 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నాడు. 2016లో రిటర్మెంట్ ప్రకటించాడు. అనంతరం రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించాడు.
కాగా 2021 నుంచి కొల్త్సోవ్- అరీనా సబలెంక జంటగా కనిపించడం మొదలుపెట్టారు. ప్రియుడిపై ప్రేమను చాటుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో తరచూ షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మరణవార్తపై మాత్రం ఆమె ఇంతవరకు స్పందించలేదు. అయితే.. ఆమె అభిమానులు మాత్రం.. ‘‘హృదయం ముక్కలైంది.. ధైర్యంగా ఉండు సబలెంక’’ అని అండగా నిలుస్తున్నారు.
ఇక బెలారస్ టెన్నిస్ స్టార్ అయిన సబలెంక రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మహిళల సింగిల్స్‌లో విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా.. 31,50,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు) ప్రైజ్‌మనీగా అందుకుంది 25 ఏళ్ల సబలెంక. ప్రస్తుతం వరల్డ్ నంబర్ టూ సీడ్‌గా ఉన్న సబలెంక.. ఈ వారంలో మియామీ ఓపెన్ ఆడాల్సి ఉంది.