ఉగాండ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అభయ్ శర్మ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 54 ఏళ్ల అభయ్ శర్మ ఉగాండ క్రికెట్ జట్టుతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఏ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తమ జట్టుకు అభయ్ అనుభవం, క్రికెట్ పరిజ్ఞానం మేలు చేకూరుస్తుందని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా, ఉగాండ క్రికెట్ జట్టు పొట్టి ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించింది. జూన్ 1 నుండి యూఎస్‌ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024లో ఉగాండ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెగా టోర్నీకి క్వాలిఫై అయిన 20 జట్లలో ఉగాండ ఒకటి. గతేడాది కాలంలో ఆట పరంగా చాలా మెరుగుపడిన ఉగాండ.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు సాధించింది. రాబోయే వరల్డ్‌కప్‌లో ఉగాండ గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మేటీ జట్లతో పోటీ పడనుంది. ఉగాండ ఉండే గ్రూప్‌లో మరో పసికూన (పపువా న్యూ గినియా) కూడా ఉంది.
అభయ్ శర్మ విషయానికొస్తే.. ఈ మాజీ ఢిల్లీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ, దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటాడు. అభయ్ ఢిల్లీతో పాటు రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అభయ్ తన కెరీర్‌లో 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో దాదాపు 5000 పరుగులు చేసి 230 వరకు వికెట్లు పడగొట్టడంలో భాగమయ్యాడు. అభయ్ తన కెరీర్‌లో 9 శతకాలు, 21 అర్దశతకాలు సాధించాడు. ఆటగాడిగా కెరీర్‌కు వీడ్కోలు పలికాక అభయ్ కోచింగ్ బాధ్యతల్లోకి వచ్చాడు. అభయ్.. భారత-ఏ, భారత అండర్-19 జట్టు, ఢిల్లీ రంజీ జట్టు, భారత మహిళా క్రికెట్ జట్లకు కోచింగ్ అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment