టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ 2024 గెలుపును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన విరాట్.. వరల్డ్‌కప్ విజయానంతరం భల్లే.. భల్లే స్టెప్పులేసి ఇరగదీశాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందికి చెందిన పాపులర్ సాంగ్ "తునుక్ తనుక్"కు కోహ్లి.. సహచరుడు అర్ష్‌దీప్ సింగ్‌తో కలిసి చిందేశాడు.
టీమిండియా సెలబ్రేషన్స్‌లో భాగంగా మైదానంలోని స్పీకర్స్‌లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా.. విరాట్, అర్ష్‌దీప్‌లతో సిరాజ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా జత కలిశారు. వీరందరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరలవుతుంది.
Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o
— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024
కాగా, ఫైనల్ మ్యాచ్ గెలిచాక కాసేపు భావోద్వేగాలకు లోనైన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని ఎంజాయ్‌మెంట్ మూడ్‌లోకి వచ్చారు. జట్టు సభ్యులంతా ఎవరి స్టయిల్‌లో వారు విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆటగాళ్లంతా స్టేడియం మొత్తం కలియతిరిగి అభిమానులకు అభివాదం చేశారు. కొందరు ఫోన్లలో.. కొందరు నేరుగా తమ వారితో సంతోషాన్ని పంచుకున్నారు.
భారత ఆటగాళ్లందరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఆనందబాష్పాలు కార్చడం ప్రతి భారతీయుడి మనస్సుని హత్తుకుంది. వీరితో పాటు కోచ్ ద్రవిడ్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. మొత్తంగా తొలుత భావోద్వేగాలు, ఆతర్వాత సంబురాలతో బార్బడోస్ మైదానం పులకించిపోయింది.
ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది.
లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment