ఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీరుపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు చేశాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కోహ్లి జట్టులో పలు మార్పులు చేశాడు. ఈ మార్పులపై కోహ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఫామ్‌లో ఉన్న బుమ్రాతో పాటు శ్రేయాస్ అయ్యర్, స్నిన్నర్ చహల్‌లను కాదని మనీష్ పాండే, సంజూ శాంసన్, దీపక్ చాహర్‌లను తుది జట్టులోకి తీసుకున్నాడు. ఏ కారణంతో శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేశాడో కోహ్లి చెప్పాలని సెహ్వాగ్ ప్రశ్నించాడు. కాగా నిన్న జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన మనీశ్ పాండే 2 పరుగులకే ఔటవ్వగా.. సంజు శాంసన్ 23 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. సోనీ టీవికి ఇచ్చిన ఇంటర్య్వూలో సెహ్వాగ్ ఈ వాఖ్యలు చేశాడు.
'నిజానికి బుమ్రా వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా చివరి వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. అలాంటి బుమ్రాను కోహ్లి ఎందుకు పక్కనపెట్టాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్ గురించి చాలా చర్చ జరిగింది. దాంతో.. ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి అవకాశమివ్వగా అతను వన్డే, టీ20ల్లో నిలకడగా రాణించి ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకొనే పనిలో ఉన్నాడు. (చదవండి : 'కాంకషన్‌పై మాట్లాడే అర్హత ఆసీస్‌కు లేదు')
కానీ తాజాగా తొలి టీ20లో అయ్యర్‌పై వేటు పడడం వెనుక కోహ్లి అంతర్యం ఏమిటో అర్థం కాలేదు. నన్నెందుకు తీశావు అని కోహ్లిని అడిగే ధైర్యం అయ్యర్‌కు ఉండదు.. ఎందుకంటే కోహ్లి టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. టీమిండియాలో ఉన్న ఆటగాళ్లందరికి రూల్స్ అందరికీ వర్తిస్తాయి.. ఒక్క విరాట్ కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనల్ని పట్టించుకోరు. అతనికి నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు.. ఆటగాళ్లపై వేటు వేస్తాడు.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ఇలా చేయడం తప్పు. కోహ్లి తన పద్దతిని మార్చుకుంటే మంచిది' అని సెహ్వాగ్ సూచించాడు. (చదవండి : నటరాజన్ రాకతో షమీకి కష్టమేనా)
Comments
Please login to add a commentAdd a comment